Bengaluru : ఎల్పీజీ సిలిండర్ల కొరత దేశంలోని మెట్రో నగరాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. వాణిజ్య సిలిండర్లకు కొరత ఏర్పడటంతో కర్ణాటక రాజధాని బెంగళూరులో రెస్టారెంట్లు, హోటల్ ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు పీజీ (పెయింగ్ గెస్ట్) అకామడేషన్స్పై కూడా పడింది. దీంతో బెంగళూరు పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెస్ట్‌లకు అందించే ఆహార పదార్థాల (మెనూ) విషయంలో మార్పులు చేశాయి. ఇకపై వీక్ డేస్‌లో రోజుకు రెండు మీల్స్ మాత్రమే అందిస్తామని ప్రకటించింది.
వీకెండ్స్‌లో మాత్రం మూడు మీల్స్ అందిస్తామని అసోసియేషన్ తెలిపింది. తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రెండు మీల్స్ మాత్రమే అందిస్తారు. అంటే ఈ ఐదు రోజులు బ్రేక్‌ఫాస్ట్ ఉండదు. అలాగే, శని, ఆదివారాల్లో మాత్రం బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి మూడు సార్లు భోజనం అందిస్తారు. అలాగే అత్యధికంగా గ్యాస్ వినియోగించి తయారు చేసే దోశ, చపాతి, పూరి వంటివి అందించరు. వీటి బదులు తక్కువ గ్యాస్ అవసరమయ్యే బిసిబెలెబాత్, చిత్రాన్నం, పులిహోర వంటి రైస్ ఐటమ్స్ అందిస్తారు. అలాగే తక్కువ గ్యాస్ అవసరమయ్యే లేదా అసలు గ్యాస్ అవసరమే లేని సలాడ్స్ వంటివి అందించాలని కూడా పీజీ అసోసియేషన్ నిర్ణయించింది. అలాగే ఎల్పీజీ గ్యాస్ వినియోగం తగ్గించి, ఇండక్షన్ స్టవ్లవైపు కొన్ని పీజీలు మొగ్గు చూపుతున్నాయి.
బెంగళూరులో లక్షల మంది పీజీ (హాస్టళ్లు)లలో ఉంటున్నారు. వీరందరికీ ఆహారం అందించాలంటే భారీ సంఖ్యలో ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్లు అవసరం. ప్రస్తుతం గల్ఫ్ సంక్షోభం కారణంగా తగినంత సరఫరా లేకపోవడంతో పీజీలు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయని పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, బెంగళూరు అధ్యక్షుడు అరుణ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల కొన్ని మార్పులతో పీజీలు నడిపిస్తున్నామని, కానీ, 10-15 రోజుల్లో పరిస్థితుల్లో మార్పులు రాకపోతే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన అన్నారు.