Village nature park | చందుర్తి, ఆగస్టు 2 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లోనూ పట్టణ వాతావరణం కల్పించి, ప్రకృతి ఆహ్లాదాన్ని పంచాలనే ఉద్దేశంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలు నేడు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు పల్లె ప్రకృతి వనాలు ప్రతీకలని భావించి దాదాపు 70 శాతం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను నిర్మించింది. రంగురంగుల పూల మొక్కలు, వివిధ రకాల అందమైన మొక్కలు ఆహ్లాదాన్ని పంచే పచ్చదనంతో కళకళలాడిన ప్రకృతి వనాలు నేడు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి.
చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో గ్రామ శివారులో ఒక్క ఎకరం స్థలాన్ని కేటాయించి, సుమారు రూ,7లక్షల 14వేల అంచనా వ్యయంతో 4 వేల మొక్కలతో ఆధునిక హంగులతో అప్పటి పంచాయతీ పాలకవర్గం పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించింది. ఇటీవల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. కాగా పల్లె ప్రకృతి వనాన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు చేపడుతున్న ఓ కాంట్రాక్టు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా పల్లె ప్రకృతి వనాన్ని తొలగించి రెండు క్యాబిన్ గదులను నిర్మించింది. దీంతో స్కూల్ నిర్మాణం సరే పల్లె ప్రకృతి వనం తొలగించడమేంటని గ్రామస్తులు, ప్రకృతి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎంపీవో రాజేశ్వర్ గౌడ్ ను వివరణ కోరగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, నోటీసులు అందజేస్తామని తెలిపారు.