ఇటీవల ఎడతెరిపి లేకుండా పడిన వానలు పత్తి రైతులను నిండా ముంచాయి. దసరా పండుగకు తొలివిడుత పత్తి పంట చేతికందే వేళ చేన్లు పూర్తిగా ఎర్రబారిపోతున్నాయి. ఇప్పటికే ఏపుగా పెరిగిన మొక్కలకు పూత రాలిపోతుండగా, కాయలు కుళ్లిపోతున్నాయి. జూన్, జూలై నెలలో ఆశాజనకంగా ఉన్న చేన్లు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు దెబ్బతినడంతోపాటు దిగుబడులపై ప్రభావం చూపుతుందని రైతులు అందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రెండు క్వింటాళ్ల వరకు పత్తి కాయలు నల్లబడి కుళ్లిపోయాయని ఆవేదన చెందుతున్నారు.
కోనరావుపేట, అక్టోబర్ 3 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ యేడాది రైతులు 43,300 పైగా ఎకరాల్లో పత్తి సాగుచేశారు. మొదట చేన్లు బాగా ఉండడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని మురిసిపోయారు. కానీ, ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతిన్నదని ఆందోళన చెందుతున్నారు. మొదట ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేయగా, ప్రస్తుతం వర్షంతో పక్వానికి వచ్చిన పత్తి కాయలు నల్లబడి కుళ్లిపోయాయి. అంతేకాకుండా చేన్లకు బూజు తెగుళ్లు, పండు తెగుళ్లు, ఎర్రనల్లి లాంటివి ఎక్కువగా వ్యాపించాయి.
వర్షాలు అధికంగా పడడంతో సస్యరక్షణ ఎక్కువసార్లు చేయాల్సి వస్తున్నది. ఇప్పటికే ఐదుసార్లు పురుగుల మందు పిచికారీ చేశారు. యూ రియా కొరత కారణంగా ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులు వినియోగించారు. అంతేకాకుండా పురుగు, దోమ, తెగుళ్లకు మందులు అధిక శాతం పిచికారీ చేశారు. ఒక్కో ఎకరాకు సుమారు 20వేల నుంచి 30 వేలకు పెట్టుబడి పెట్టారు. అయినా చేలలో కాయలు ఏమీలేవని రైతులు దిగాలు చెందుతున్నారు. దీంతో 6 నుంచి 7 క్వింటాళ్లు వస్తుందో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
..పై చిత్రంలో కనిపిస్తున్న రైతు శివరాత్రి భానుచందర్. కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి. ఆయన ఎనిమిదెకరాలు కౌలుకు తీసుకొని, పత్తి పంటను సాగుచేస్తున్నాడు. ఎకరాన 12వేల వరకు కౌలు మొదటనే చెల్లించాడు. దీంతో పాటు దున్నిన, ఎరువులు ఖర్చు సుమారు ఎకరాన 30ల వరకు పెట్టుబడి పెట్టాడు. జూన్, జూలైలో పత్తి బాగానే ఉండడంతో దిగుబడి వస్తుందని ఆనందంతో ఉన్నాడు. కానీ ఆగస్టు, సెప్టెంబర్లో పడిన వర్షాలకు పత్తి పూర్తిగా ఎర్రబారిపోయి తెగుళ్లు సోకడంతో ఆందోళన చెందాడు. చేసేదేమీ లేక ఐదుసార్లు మందులను పిచికారీ చేశాడు. అయినా, ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం చెట్లు ఆకురాలుతుండగా, కాయలు నల్లబారి పోయా యి. పూత పూర్తిగా రాలిపోయి చేనుతో పత్తి కట్టె కనబడుతున్నది. ఎంతో దిగుబడి వస్తుందని ఆశించగా చివరికి కనీసం పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదని భానుచందర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తనలాంటి కౌలు రైతులును ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
వర్షాల వల్ల పత్తికి తెగుళ్లు, ఎర్రనల్లి వంటివి ఎక్కువగా వస్తాయి. కానీ, ప్రస్తుతం రైతులు చేలల్లో పనులు చేపట్టలేని పరిస్థితి ఉన్నది. వానలు పూర్తిగా తగ్గిన తర్వాత పత్తికి అనుకూల వాతావరణం ఏర్పడితే పూత, గూడు, కాయ పోయిన చోట మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో వ్యవసాయ విస్తరణాధికారుల సూచనలు పాటించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే, రానున్న రోజుల్లో చలి పెరిగే అవకాశం ఉన్నందున రసం పీల్చే పురుగులతో పాటు ఇతర పురుగుల ప్రభావం పెరుగుతుంది. వాటి నివారణకు కూడా మందులు పిచికారీ చేయాలి. అధిక వర్షాల వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఆస్కారం ఉన్నది. రైతు లు అందోళన చెందవద్దు.
-సందీప్, ఏవో (కోనరావుపేట)