Ramagiri | రామగిరి, మే 3 : రామగిరి మండలం జల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని సింగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన గీత కార్మికుడు ధోనికేటి శ్రీనివాస్ గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. శ్రీనివాస్ గౌడ్ రోజువారీలా ఆదివారం తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తుండగా అకస్మాత్తుగా మోకు జారి కిందపడిపోయాడు.
ఈ ప్రమాదంలో అతని చెయ్యి విరిగిపోవడంతో పాటు శరీరానికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి గీత కార్మికులు వెంటనే స్పందించి శ్రీనివాస్ గౌడ్‌ను చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది. శ్రీనివాస్ గౌడ్ నిరుపేద కుటుంబానికి చెందినవాడని, గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితుడిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గౌడ సంఘం నాయకులు చింతల చంద్రయ్య గౌడ్, గట్టు శ్యామ్ గౌడ్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.