మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన మరో ఘట్టానికి నేడు తెరపడనున్నది. వారం రోజుల నుంచి సాగుతున్న ప్రచార పర్వానికి మరికొద్ది గంటల్లోనే బ్రేక్పడనున్నది. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్‌కు రెండ్రోజుల ముందు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మైకులన్నీ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కాగా, అందరికంటే ముందుగానే ప్రచారంలోకి దిగిన బీఆర్ఎస్లో నయాజోష్ కనిపిస్తుండగా, మిగిలిన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయా వార్డుల్లో ముఖ్య నాయకులతో సమావేశమవుతూ, ఓటర్లకు ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు. దూర ప్రాంతాల ఓట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతూ, వ్యూహాలకు పదును పెడుతున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్/ జమ్మికుంట, ఫిబ్రవరి8 : కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉండగా, 2,232 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారం రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ప్రచారం మరింత వేడెక్కింది. సోమవారం సాయంత్రం ప్రచారానికి తెరపడనుండగా, అభ్యర్థులు క్షణం గ్యాప్ లేకుండా నగరాలు, పట్టణాల్లో కలియదిరుగుతున్నారు. కార్నర్మీటింగులు, ప్రచారాలతో బిజీగా మారిపోయారు. గల్లీలన్నీ చుట్టేస్తూ.. ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ.. తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
అందుబాటులో ఉంటామని, డివిజన్లలోని సమస్యలు పరిష్కరిసామని.. అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తూ ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకుంటున్నారు. అలాగే దూరప్రాంతాల్లోని ఓటర్లపై ఫోకస్ చేసి, పోలింగ్ నాటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్తూ.. ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన విప్లవాత్మక పథకాలను వివరిస్తూ మద్దతు కూడగడుతున్నారు. మరోవైపు రెండేళ్ల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను, హామీలు అమలు చేయని తీరును ఎండగడుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. పనిచేసినోళ్లకే ఓట్లేయాలని, పైసా పనిచేయనోళ్లకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడికక్కడ జైకొడుతుండగా, ఇతర పార్టీల అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరతీస్తున్నారు.
ఇటు మంత్రులను, ముఖ్య నాయకులను రంగంలోకి దించుతుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు తిరస్కరిస్తున్నారు. శనివారం హుజూరాబాద్‌లోని కార్నర్ మీటింగ్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్ సెగ చూపించారు. ఓ వైపు సమావేశం జరుగుతుండగానే పీవీ జిల్లా సాధన సమిత సభ్యులు ‘వీ వాంట్ పీవీ జిల్లా’ అంటూ నినాదాలు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హుజూరాబాద్ జిల్లా చేస్తామని కాంగ్రెస్ మేనిఫేస్టోలో పెట్టిందని, సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడ జరిగిన సమావేశంలోనూ పీవీ జిల్లా చేస్తామని హామీ ఇచ్చారని, అందుకనుగుణంగా జిల్లాను ప్రకటించాలని కోరారు. అలాగే సిరిసిల్లలో సీనియర్ నాయకుడు వీ హన్మంతరావు వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మహిళలు ఆయనను నిలదీయగా.. చేసేదేమీ లేక పని చేసేవాళ్లనే గెలిపించుకోండి అంటూ అసహనం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. మిగతా వాళ్ల పరిస్థితి కూడా ఇలానే కనిపిస్తున్నది.