సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ ): ఓ వైపు నీట్ ప్రశ్నాపత్రం లీక్ చేసి అమాయక విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పిన కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ధోకా వెరసి ఆశావహులు, భవిష్యత్తు బాగుండాలని కాంక్షించే నేటి జెన్జీలు మనోవేదన చెందుతున్నారు. తమ భవిష్యత్తు బాగుండాలని ప్రశ్నిస్తే ఢిల్లీ జంతర్‌మంతర్‌లో నీట్ విద్యార్థులను పోలీసులు పాశవికంగా కొట్టారు. అమ్మాయిలని చూడకుండా లాఠీలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. నీట్ పరీక్షపై ఆశలు పెట్టుకునే వారిలో అన్ని రాష్ర్టాల విద్యార్థులు ఉంటారు. అది దేశ విద్యార్థుల సమస్య. అట్లాంటి సమస్యతో జెన్జీలు రేయింబవళ్లు పోలీసు కేసులు, లాఠీ దెబ్బలు, బుల్లెట్ గాయాలు లెక్క చేయకుండా పోరాడుతుంటే ఇక్కడి సీఎం రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు.
బీజేపీ నాయకులకు పట్టింపేలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీట్ విద్యార్థులకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ కేటీఆర్ భరోసానిచ్చారు. నీట్ విద్యార్థులపై దమనకాండకు పూనుకున్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఇందిరాపార్కులో సభ నిర్వహించి జెన్‌జీలలో ధైర్యాన్నినింపారు. జెన్‌జీలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన ప్రసంగం ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురవుతున్నారని, తనకూ ఇద్దరు జెన్‌జీ కిడ్స్ ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి పట్టింపే లేనట్టు సభల పేరుతో తప్పించుకుంటున్నారని అదే లాఠీ దెబ్బలు వారి కుటుంబ సభ్యులపై పడితే ఇలానే మౌనంగా ఉండేవారా అని ప్రశ్నించారు.
నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. తాత్సారం చేస్తే ‘రాజ్యమా ఉలిక్కిపడు. జెన్‌జీలకు పొట్టుపొట్టు ఆకలి ఉంది..మెట్టు మెట్టు ఎక్కి తొక్కుతరని తనదైన శైలిలో కేటీఆర్ ఇచ్చిన వార్నింగ్‌కు సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా చప్పట్లతో దద్దరిల్లింది. ప్రతీ తరానికి ఓ జెన్‌జీ ప్రశ్నిస్తుందని -‘జీనా హైతే మర్నా సీఖో..కదం కదం పర్ లడ్నా సీఖో’ అంటూ కేటీఆర్ చెప్పిన ఆ నినాదానికి జెన్జీలు పిడికిళ్లు బిగించి కేటీఆర్‌కు మద్దతుగా నినదించారు. 6 ఏండ్ల కిందటే కేసీఆర్ యూత్‌ను ఉద్దేశించి ‘ ఈ దేశం మీది రేపటి భవిష్యత్తు మీది. దీన్ని కాపాడుకోవాల్సింది మీరే. ఇండియా విల్ రియాక్ట్” అన్నారని గుర్తు చేయడంతో మరోసారి సభా ప్రాంగణం జై కేసీఆర్ అంటూ నినదించారు. జెన్జీలతో పెట్టుకోవద్దంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
వారిది స్వచ్చమైన ఉద్యమం..వారిని రాజకీయ పార్టీల జెండాలతో మలినం చేయొద్దన్నారు. జెన్జీలు చేసే ఎటువంటి పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని, మీపై పోలీసు కేసులు ఉపసంహరించుకునేలా పోరాటం చేస్తామని వారికి అభయమిచ్చారు. ఇక రేవంత్ రెడ్డిపై వేసిన సెటైర్లు సభలో నవ్వులు పూయించాయి. ఓ సినిమాలో ఒక పిల్లగాడ్ని ఎన్నిసార్లు ఏం కావాలని అడిగినా కుక్క కావాలి అంటుంటాడు ఆ సినిమా పేరేందో తెలియదు.. అనగానే చిత్రం సినిమా అంటూ జెన్జీలు చెప్పారు. ఆ సినిమాలో మాదిరిగానే రేవంత్ రెడ్డిని ఏ విషయం అడిగినా కేసీఆర్, కేటీఆరే కారణమంటాడని అనడంతో నవ్వులు పూశాయి. మరోవైపు బీజేపీతో రహస్య బంధాన్ని కొనసాగిస్తూనాటకాలు ఆడుతున్నాడని అన్నారు. బీజేపీని ఎదురిస్తే ఓటుకు నోటు కేసులు బయటకు తీస్తారనే భయంపట్టుకుందని కేటీఆర్ అనడంతో రేవంత్ ఛోర్ అంటూ నినాదాలు చేశారు. ఇలా కేటీఆర్ ఉపన్యాసమంతా ఆద్యంతం జెన్‌జీలను చైతన్యపరుస్తూ సాగింది.