శాసనమండలి పోరుకు సర్వం సిద్ధమైంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు సంబంధించిన ఎన్నికలకు యంత్రాంగం రెడీ అయింది. నేటి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుండగా, అందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రాడ్యుయేట్ స్థానానికి 3,55,159 మంది, టీచర్ స్థానానికి 27,088 మంది ఓటు వేయనుండగా, అప్పుడే అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. వచ్చే నెల 3న భవితవ్యం తేలనుండగా, అప్పటిదాకా ఉత్కంఠ కొనసాగనున్నది.
కరీంనగర్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) / కరీంనగర్ కలెక్టరేట్ : కరీంనగర్- ఆదిలాబాద్- మెదక్- నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు నేడు ఎన్నికలు జరగునున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పట్టభద్రుల స్థానానికి మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. 3,55,159 మంది ఓటర్లున్నారు. అలాగే ఉపాధ్యాయ స్థానానికి 15 మంది బరిలో ఉండగా.. 27,088 మంది ఓటర్లు ఉన్నారు. 15 కొత్త జిల్లాలు, 271 మండలాల పరిధిలో ఈ ఎన్నికలు నిర్వహిస్తుండగా, ప్రతి మండల కేంద్రంతోపాటు మున్సిపాలిటీల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గ్రాడ్యుయేట్స్‌కు సంబంధించి 499, టీచర్స్‌కు సంబంధించి 274 మొత్తం ఈ రెండు స్థానాలకు 773 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలన్నింటిలో సీసీ కెమెరాలు అమర్చడంతోపాటు వాటిని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్‌కు అవసరమైన సామగ్రి ఇప్పటికే ఆయా జిల్లాలు, మండలాలు, అలాగే పోలింగ్ కేంద్రాలకు పంపించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు 4,199 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.
అందులో భాగంగా 394 మంది మైక్రో అబ్జర్వర్లు, 335 మంది జోనల్ అధికారులు, 864 మంది ప్రిసైడింగ్, 2,606 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రం వివరాలతో కూడిన పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను కరీంనగర్లో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రానికి తెచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
బ్యాలెట్ బాక్సులను అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచేలా పటిష్ట ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని బుధవారం మధ్యాహ్నం రిటర్నింగ్ ఆఫీసర్ పమేలా సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా పీవోలు, సిబ్బంది, ఇతర అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇటు ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
మండలి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏదేని ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. అందుకు ఓటరు గుర్తింపుకార్డుతోపాటు ఎన్నికల సంఘం 12 రకాల గుర్తింపుకార్డులను సూచించింది. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్‌బుక్, ఉపాధి హామీ జాబ్ కార్డులలో ఏదైనా ఒక కార్డు చూపాలని చెప్పింది.
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదిత ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు వర్తింప జేస్తున్నట్టు రిటర్నింగ్ ఆఫీసర్ పమేలా సత్పతి తెలిపారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్ అథారిటీల్లో పని చేస్తూ పట్టభద్రుల ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమతి ఇవ్వాల ని, అందుకు అవసరమైన వెసు లుబాటు కల్పించాలని సూచించారు.