రాజ్యాంగ నిర్మాత, భారతదేశ దార్శనికుడు, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడకకు వేళయింది. శుక్రవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధమవుతున్నది. ఆయా జిల్లా కేంద్రాల్లో షెడ్యూల్, కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించనుండగా, యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు హాజరై, నివాళులర్పించనున్నారు. అటు హైదరాబాద్‌లో ప్రభుత్వం 125 అడుగుల విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి చేయగా, జిల్లా నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లనున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 13: నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ దార్శనికుడు, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జ యంతి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరీంనగర్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలు స్థానిక కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించనున్నారు. ఏటా నిర్వహించినట్లే ఈసారి కూడా ఘనంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు పాడి కౌశిక్‌రెడ్డి, టీ భానుప్రసాదరావు, ఎల్ రమణ, టీ జీవన్‌రెడ్డితో పాటు ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, బండి సంజయ్‌కుమార్, తదితరులు పాల్గొననున్నట్లు నిర్వాహక కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. సభా కార్యక్రమం సుదీర్ఘంగా కొనసాగే అవకాశమున్న దృష్ట్యా ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి దృష్ట్యా టెంట్లు, మంచినీటి వసతి కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
రాజధానికి తరలివెళ్లేందుకు ఏర్పాట్లు..
జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ సభకు జిల్లా నుంచి వెళ్లే ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మందికి తగ్గకుండా జనసమీకరణ చేస్తున్నారు. వీరిని హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రతి మండలానికి ఒక బస్సు చొప్పున పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి సెగ్మెంట్‌కు 6 బస్సుల చొప్పున పంపుతుండగా, అదనంగా వెళ్లే వారికి కూడా మంత్రి గంగుల చొరవతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వీరందరికీ అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, తాగునీటి వసతి కూడా ప్రభుత్వమే కల్పిస్తుండగా, జిల్లా నుంచి నిర్దేశించిన మేరకు జనాలను తరలించనున్నారు. దేశంలోనే మొదటిసారిగా రూపుదిద్దుకున్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ఆసక్తి కనబరుస్తుండడం గమనార్హం.