కమాన్‌చౌరస్తా, ఫిబ్రవరి 19 : వచ్చే నెలలో నిర్వహించనున్న ఇంటర్, పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ సారి ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇంటర్ పరీక్షల పర్యవేక్షణ ఉంటుందన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరికీ సెల్ ఫోన్ అనుమతి లేదని తెలిపారు. ప్రశ్న పత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాల్లో ఉండరాదని, గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ కేంద్రాల్లోకి అనుమతించరాదని ఆదేశించారు. పరీక్షలు జరిగే తేదీల్లో ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్ష వేళల్లో విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, భయం లాంటి మానసిక సమస్యలను ఎదురోవాల్సి వస్తే బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నియమించిన మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని, దీని కోసం టోల్ ఫ్రీ నంబర్ 14416 లేదా 1800 914416లో సంప్రదించాలని చెప్పారు. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించరని స్పష్టం చేశారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. ప్రథమ సంవత్సరం 17,799 మంది, ద్వితీయ సంవత్సరం 17,763 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. మొత్తం 58 సెంటర్లు ఏర్పాటు చేశామని కరీంనగర్లో 37 సెంటర్లు ఉన్నాయని వెల్లడించారు. జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు మాట్లాడుతూ, మారి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 73 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 12,516 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. సమావేశంలో పరీక్షల కమిటీ సభ్యులు ఆంజనేయ రావు, సత్యవర్ధన్ రావు, శశిధర్ శర్మ, హెచ్పీసీ మెంబర్ మధు మోహన్ రావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో వెంకటరమణ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్, ఫిబ్రవరి 19 : 18 ఏండ్లు నిండిన వారి ఆధార్ నమోదుకు సంబంధించి తహసీల్దార్ల లాగిన్లలో ఉన్న పెండింగ్ దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాస్థాయి ఆధార్ నమోదు కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాల విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ కోసం పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని పలు అనాథాశ్రమాల్లో పెరుగుతున్న వారికి ఆధార్ ఎన్రోల్మెంట్లో వచ్చే సమస్యలు పరిష్కరించాలని యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ చైతన్యరెడ్డిని కోరారు. ఈ సమావేశంలో ఆయన వర్చువల్‌గా పాల్గొనగా, జిల్లాకు సంబంధించి నమోదు పూర్తయిన ఆధార్ గణాంకాలను సంబంధితాధికారులు వివరించారు. 5 నుంచి 15 ఏళ్లలోపు పిల్లల ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి అప్డేట్ చేయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కె.సబిత, వైద్యాధికారి వెంకటరమణ, డీఈవో జనార్దన్‌రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు, ఈడీఎం శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.