NTPC | జ్యోతినగర్, ఆగస్టు 22: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రామగుండం ఎన్టీపీసీలో 2022, ఆగస్టు 22న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు ఎన్టీపీసీ లేబరేట్లో చేపడుతున్న నిరసన పోరాటంలో కార్మికులపై ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ జవాన్లు చేపట్టిన లాఠీచార్జికి మూడేళ్లు గడిచింది. 70మంది వరకు కార్మికులకు గాయాలయ్యాయి. పలువురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా గాయపడ్డారు. ఇందులో పదిమంది కార్మికులు, పలువురు కార్మిక సంఘాల నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు ఈ ఘటన సంచలనం సృష్టించింది.
ఈ లాఠీచార్జీ ఘటనపై ఎన్టీపీసీ యాజమాన్యం చేపట్టిన విచారణ ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. గాయపడిన కార్మికులు సీఐఎస్ఎఫ్ అధికారులపై పెట్టిన కేసు మూసివేయగా, అధికారులు పెట్టిన కేసుతో నేటికి ఏడుగురు కార్మిక సంఘాల నాయకులు కోర్టు చుట్టు తిరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు.
జేఏసీ నాయకుల బ్లాక్ డే
లాఠీచార్జికి నిరసనగా శుక్రవారం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో బ్లాక్డే జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎన్టీపీసీ గేట్ నంబర్ 2 వద్ద జేఏసీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల సాధనకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న క్రమంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అకారణంగా లాఠీచార్జి చేసి, కార్మికులను గాయపరిచి, కార్మిక సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించినట్లు తెలిపారు. వెంటనే అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ జేఏసీ సీఐటీయూ, ఐఎన్టీయూ, జీఏఎన్సీడబ్ల్యూయూ, టీఎన్టీయూసీ, బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాల నాయకులు నాంసాని శంకర్, చిలుక శంకర్, ఆర్ రాజమల్లయ్య, ఇజ్జగిరి బూమయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.