రాయికల్ రూరల్, ఆగస్టు 3: కన్నతల్లి ముందే మూడేళ్ల బాలుడు డ్రైనేజీలో పడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల ప్రకరాం.. రాయికల్ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన అక్బర్- నజీమా కు నలుగురు పిల్లలు. రాయికల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో మూడో సంతానమైన అక్సర్ (3) వర్షం తగ్గగానే తన ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ సమీపంలోని డ్రైనేజీలో పడ్డాడు. వరదతో నిండుగా ప్రవహిస్తుండడంతో కొట్టుకుపాయాడు. అక్కడే ఉన్న పిల్లల అరుపులతో త ల్లి పరుగెత్తుకుంటూ వచ్చి కొడుకును కాపాడేందుకు డ్రైనేజీలో దిగింది. వరద ఉధృతికి ఆమె కూ డా కొట్టుకుపోగా స్థానికులు కాపాడారు. బాలుడి కోసం గాలించగా 2 కిలోమీటర్ల దూరంలో చెట్ల పొదల్లో మృతదేహం కనిపించింది. కండ్లముందే కొడుకు మరణంతో తల్లిదండ్రుల రోదనలు కంటతడి పెట్టించాయి. అక్సర్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ తెలిపారు.
ఎమ్మెల్యే పరామర్శ..
అక్సర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల దవాఖానకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దవాఖానకు వెళ్లి అక్షర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పో స్టుమార్టం అయ్యేదాకా అక్కడే ఉండి ఏర్పాట్లను చూశారు. అన్నివిధాలా ఆదుకుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆయన వెంట రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, కౌన్సిలర్ కన్నాక మహేందర్, నాయకులు మోర రామ్మూర్తి, హూస్సేన్, సోహైల్ తదితరులు ఉన్నారు.