రెండో విడుత రుణమాఫీలోనూ మళ్లీ అదే దగా ఎదురైంది. మొదటిసారి మాదిరిగానే ఈ సారి సైతం వేలాది మంది పేర్లు గల్లంతు కావడం గందరగోళానికి గురి చేస్తున్నది. అంతేకాదు, మెజార్టీ సహకార సంఘాల్లో యాభై శాతం మంది రైతులకు కూడా మాఫీ కాకపోవడం, పలు చోట్ల ఊళ్లకు ఊళ్లే మాయం కావడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అసలు మాఫీ ఎందుకు కాలేదో తెలియక వేలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు తెలుసుకోవడం కోసం వ్యవసాయ అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే ఏ ఒక్క అధికారి నుంచి స్పష్టమైన సమాధానం రాక అయోమయానికి లోనవుతున్నారు. జాబితాలో మిస్ అయిన వారికి భవిష్యత్‌లో రుణమాఫీ వర్తింప చేస్తారా..? లేదా..? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నా నివృత్తి చేసేవారు లేక ఆగమవుతున్నారు.
ఎల్లారెడ్డిపేట : రెండో విడత రుణమాఫీ జాబితాలో పేర్లు రాకపోడం, లిస్టులో పేరున్నా మాఫీ వివరాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బుధవారం ఎల్లారెడ్డిపేట వ్యవసాయ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏవో చాడ భూంరెడ్డి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేయించుకున్నారు.
కరీంనగర్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడుత కింద లక్ష వరకు రుణం మాఫీ చేస్తూ పది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 1,28,761 మంది రైతులకు 710.29 కోట్లు మాఫీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తీరా రుణమాఫీ జాబితా విడుదలైన తర్వాత చూస్తే వేలాది మంది రైతుల పేర్లు గల్లంతుకాగా, కొన్ని గ్రామాల్లో అయితే ఒక్క రైతుకు కూడా మాఫీ కాలేదు. కొన్ని జాతీయ బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.
ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని సహకార శాఖల్లో లక్ష రుణమాఫీకి 58,577 మంది అర్హులు ఉండగా, 305.5 కోట్ల మాఫీ జరగాలి. కానీ, 32,240 మందికి 165.88 కోట్లు మాత్రమే జరిగింది. ఇంకా 26,337 మందికి 139.62 కోట్లకుపైగా మాఫీ కాలేదు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తున్నది. రెండో విడుత కింద ఉమ్మడి జిల్లాల్లో 63,286 మందికి 580.71 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొదటిసారి వచ్చిన విమర్శల నేపథ్యంలో రెండో సారైనా పకడ్బందీగా రుణమాఫీ జరుగుతుందని రైతులు ఆశించినా, మళ్లీ అదే దగా జరిగింది.
కేడీసీసీబీ పరిధిలోని సహకార శాఖల్లో లక్షా యాభైవేల వరకు తీసుకున్న రైతుల్లో 49 శాతం మందికి ఈ సారి కూడా రుణమాఫీ జరగలేదు. ఇదే పరిస్థితి తిరిగి జాతీయ బ్యాంకుల్లోనూ కనిపిస్తున్నది. అలాగే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చూస్తే పలు గ్రామాల్లో మెజార్టీ రైతులకు మాఫీ కాలేదు. మొత్తంగా చూస్తే.. రెండో విడుత రుణమాఫీ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పులు చెప్పిందే తప్పా మళ్లీ మొదటిసారి చేసిన తప్పులను దిద్దుకోలేదన్న విమర్శలున్నాయి.
రైతుల్లో ఆందోళన..అధికారుల్లో స్పష్టత కరువు
నిజానికి మొదటి విడుతతో పేర్లు రాని రైతులు అధికారులను ప్రశ్నిస్తే.. సాంకేతిక కారణాల వల్ల మాఫీ జరగలేదని, రెండు మూడు రోజుల్లో సవరించి అప్లోడ్ చేస్తున్నామని సర్దిచెప్పారు. అంతేకాదు, లక్షా యాభై వేలు మాఫీ జరిగే సమయంలో లక్ష జాబితాలో మిస్ అయిన రైతులకు కూడా తిరిగి మాఫీ జరుగుతుందని, అప్పటివరకు ఓపిక పట్టాలని, ప్రభుత్వం నుంచే తమకు సమాచారం వచ్చిదంటూ నచ్చ జెప్పారు.
దీంతో రైతులు మాఫీ కాని విషయాన్ని వ్యవసాయ విస్తరణాధికారులకు వివరించి, వేచి చూశారు. తీరా లక్షా యాభైవేల జాబితాలో చూస్తే.. గతంలో గల్లంతైన ఏ ఒక్క రైతు పేరు సదరు జాబితాలో లేదు. ఇదే సమయంలో లక్షా యాభైవేల బాకీ రైతులందరికీ కూడా రుణమాఫీ జరగలేదు. దీంతో మొదటి, రెండో విడుత రుణమాఫీ జరగని రైతులందరూ వ్యవసాయ విస్తరణ అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. తమకెందుకు కాలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
గతంతో పోలిస్తే రైతుల తాకిడి బాగా పెరగ్గా.. అధికారులు ఆందోళన చెందుతున్నారు. సిస్టమ్ ఓపెన్‌చేసి.. మాఫీ జరగకపోవడానికి కారణం చెబుతున్నా.. రైతులనుంచి వస్తున్న ప్రశ్నలకు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. పోని తిరిగి ఎప్పుడు మాఫీ అవుతుందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. బ్యాంకుల్లోనూ అదే అస్పష్టత నెలకొన్నది. రైతులు వెళ్లి అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. రుణమాఫీ జరగని విషయం తమకు తెలియదని, వ్యవసాయ విస్తరణ అదికారుల వద్దకు వెళ్లి తెలుసుకోవాలంటూ బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో రైతులు అటు బ్యాంకులు, ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యయప్రయాసాలకు లోనవుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొందరికే మాఫీ
పట్టా పాసు పుస్తకం పెట్టి క్రాప్‌లోన్ తీసుకున్న ప్రతి రైతుకు 2 లక్షల మాఫీ చేయాలి. కానీ, రేవంత్ సర్కారు అనేక కొర్రీలు పెట్టి కొందరికే చేస్తుంది. నేను పెద్దపల్లి ఇండియన్ బ్యాంకుల 1.20 లక్షల క్రాప్‌లోన్ తీసుకున్న. ఈ యేడాది ఫిబ్రవరిల వడ్డీ కట్టి రెన్యువల్ చేయించిన. కానీ, రెండో విడుత లిస్టుల నా పేరు లేదు. బ్యాంకుకు వెళ్లి అడిగితే సరైన సమాధానం లేదు. నాకు తెల్ల రేషన్ కార్డు ఉంది. ఐటీ లేదు. మరి ఎందుకు మాఫీ కాలేదో తెలుస్తలేదు. నాలెక్కన చాలా మంది రైతులకు మాఫీ కాలే.
– కే సారయ్య గౌడ్, రంగంపల్లి (పెద్దపల్లి)
ఎందుకు కాలేదో తెలుస్తలేదు
మాకు మూడెకరాలు ఉన్నది. మా నాన్న నర్సయ్య మూడేళ్ల కింద కోపరేటివ్ బ్యాంకుల 94 వేల లోన్ తీసుకున్నడు. ఏడాది కింద చనిపోయిండు. సర్కారు రుణమాఫీ చేస్తనని చెబితే మా నాన్న తీసుకున్న లోన్ కూడా మాఫీ అయితదని అనుకున్న. కానీ, లక్షలోపు లిస్టుల పేరు రాలే. బ్యాంకోళ్లను అడిగితే.. లోన్ మిత్తి తోటి కలిపితే లక్ష కంటే ఎక్కువైనయ్ అన్నరు. సెకండ్ లిస్టుల వస్తది అన్నరు. కానీ, 1.50లక్షలలోపు లిస్టుల కూడా రాలే. సచ్చిపోయినోళ్లకు మా దగ్గర ఇద్దరు ముగ్గురికి మాఫీ అయినయ్. మా నాన్నది ఎందుకు కాలేదో తెలుస్తలేదు. – మానుక లక్ష్మణ్, రైతు (ఎల్లారెడ్డిపేట)
రుణమాఫీకి కొర్రీలెందుకు?
నేను రెండేండ్ల కిందట బ్యాంకులో రూ. 90వేల పంట రుణం తీసుకున్న. ఇప్పుడు మిత్తితో కలిపి లక్ష దాటింది. రెండో విడుతల అప్పు మాఫీ అవుతుందని అనుకున్న. కానీ మొన్న సర్కారు విడుదల చేసిన లిస్ట్‌లో నా పేరులేదు. ఎందుకని అధికారులను అడిగితే నీకు రేషన్కార్డులేదని అంటున్నరు. సీఎం ఏమో కార్డులేకున్నా మాఫీ చేస్తమని చెబితే నిజమేనని నమ్మినం. ఇప్పుడు లేనిలేని కొర్రీలు పెట్టుడెందుకు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూల్స్ పెట్టకుండానే రైతులందరి అప్పులు మాఫీ జేసింది. కానీ కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ పేర ఆగం జేత్తున్నది.
– యాదగిరి వెంకటేశ్వర్రావు, రామహనుమాన్నగర్ (తిమ్మాపూర్)
రెండు విడుతల్లో మాఫీ కాలే..
నాకు మూడెకరాల 15 గుంటల భూమి ఉంది. పూడూర్ సపహకార సంఘంలో గతంలో క్రాప్‌లోన్ తీసుకున్న. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు 52 వేల లోన్ మాఫీ అయింది. మళ్లీ పూడూర్ ఇండియన్ బ్యాంక్‌ల 80 వేల లోన్ తీసుకున్న. మాఫీ అయితది అనుకున్న. కానీ, కాలే. కాంగ్రెస్ సర్కారు మొదట ఇచ్చిన లిస్టుల నా పేరు రాలేదు. రెండో విడుతల కూడా రాలేదు. బ్యాంక్‌కు వెళ్లి అడిగితే.. వ్యవసాయ శాఖ అధికారులు లిస్టు పంపలేదని, పంపిన తర్వాత వస్తుందని చెప్పిన్రు. వ్యవసాయ అధికారులను అడిగితే.. బ్యాంక్ వాళ్లకు లిస్టు పంపినం అన్నరు. తలోమాట చెబుతున్నరు. మాఫీ అయితదన్న నమ్మకం లేదు.
– ఉట్కూరి సత్యనారాయణరెడ్డి, పూడూర్ (కొడిమ్యాల మండలం)