సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 28 : పరిపాలన చేతకాక సీఎం రేవంత్‌రెడ్డి మెదడు నిండా విషం నింపుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ కుటుంబంపై విషం చిమ్మడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఆరోపించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజలే త్వరలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన గ్యారెంటీలను అమలుచేయకుండా రేవంత్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న కేటీఆర్‌ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేందుకు కొత్త కుట్రకు తెరలేపారని ధ్వజమెత్తారు.
తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో పండుగ చేసుకున్న కేటీఆర్ బావమరిది పాకాల రాజు ఇంట్లోకి చొరబడి తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయించారని విమర్శించారు. డ్రగ్స్ దొరకలేవని ఎక్సైజ్ అధికారులు చెప్పినా కొందరు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. రఘునందన్‌రావు, ఆది శ్రీనివాస్ అవగాహన లేకుండా మాట్లాడడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చిల్లర మాటలు మానుకోవాలని హితవుపలికారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ విప్ ఆది శ్రీనివాస్ అవగాహన లోపంతో అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటివి మానుకోవాలని హితవుపలికారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్, అర్బన్ బ్యాంకు వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిడ్డి రాజు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, అర్బన్ బ్యాంకు డైరెక్టర్ శంకర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు మెంగని మనోహన్, కంచర్ల రవిగౌడ్ పాల్గొన్నారు.