Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 3: గోదావరిఖనిలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై రామగుండం మున్సిపల్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కన్నెర్ర చేశారు. నిజ నిర్ధారణకు నడుం బిగించారు. కూల్చివేతల మర్మం బయటపెట్టేందుకు దండుగా కదిలారు. స్థానిక తిలక్ నగర్ లో ఇటీవల సింగరేణి అధికారులు కూల్చివేసిన షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు సోమవారం కార్పొరేటర్లు మూకుమ్మడిగా చేరుకొని ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నినదించారు. అనంతరం పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ ఈ కూల్చివేతలకు ఇద్దరు కాంగ్రెస్ నాయకులే సూత్రధారులు, పాత్రధారులని స్పష్టం చేశారు. పైగా బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయడం వల్లనే కూల్చివేశారని బురద చల్లడం సిగ్గుచేటన్నారు. తిలక్ నగర్ లో 16 గదులకు 24 గదులు నిర్మించడమే గాకుండా పంపకాల్లో తేడాలు రావడం వల్లనే కూల్చివేతలు జరిగాయనీ, కాదంటే కూల్చివేతల వద్ద ఉన్న మైసమ్మ తల్లి గుడి సాక్షిగా ప్రమాణం చేయడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమేనా..? అని బహిరంగ సవాల్ చేశారు.
తేదీ ఖరారు చేస్తే ప్రజాకోర్టులో దోషులెవరో తేల్చుకుందామన్నారు. కూల్చివేతలు జరిగాక కూడా స్థానిక కాంగ్రెస్ నాయకుడు బాధితుల వద్ద నుంచి రూ.10వేల చొప్పున వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. అలాగే ఎల్బీ నగర్ లో నర్సింగ్ కాలేజీ ఆనుకొని జరుగుతున్న 17 గదుల నిర్మాణాలను కూడా ఇదే రీతిలో కూల్చివేసినా ఆశ్చర్యం లేదన్నారు. వ్యాపారుల దుకాణాలు కూల్చివేయించి, తర్వాత కట్టుకోమని చెప్పి అవి పూర్తయ్యాక మళ్లీ వారే కూల్చివేయించారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా ఈ కూల్చివేతలు జరిగాయా..? అని ప్రజలే ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. తిలక్ నగర్ లో కూల్చివేతకు గురైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పునరుద్ధరించి బాధితులకు వెంటనే షాపులు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, కార్పొరేటర్లు కర్క పద్మజ శ్రీనివాస్, తోకల శ్యామణి రమేష్, ఆకారపు రేఖ మహేష్, తాళ్ల రాజయ్య, సీనియర్ నాయకులు జేవీ రాజు, వాసు, అబ్బాసు, శ్రావణ్, చింటు, కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.