Ramagundam Baldia | కోల్ సిటీ, ఆగస్టు 8 : ఆ ఇద్దరిపై వేటు పడింది. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ గత కొంత కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశుధ్య తనిఖీ అధికారి (శానిటరీ ఇన్స్పెక్టర్) కిరణ్ తోపాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.హనుమంత రావు నాయక్ ను పెద్దపల్లి కలెక్టర్, ప్రత్యేక అధికారి కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ శుక్రవారం ప్రకటించారు.
వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా చేపట్టాల్సిన పారిశుధ్య పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యంతోపాటు తనకు కేటాయించిన డివిజన్లలో పారిశుధ్య సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందినందుకు గానూ శానిటరీ ఇన్స్పెక్టర్ డీ కిరణ్ ను సరెండర్ చేస్తూ ఆయన స్థానంలో మరొక శానిటరీ ఇన్స్పెక్టర్ ను నియమించాలని సీ డీఎంఏను కోరినట్లు తెలిపారు. అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మొబైల్ అప్లికేషన్ లో సకాలంలో డేటా అప్డేట్ చేయించడంలో పర్యవేక్షణ లోపం, టీయూఎఫ్ఐడీసీ తదితర పథకాలలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించడంలో అలసత్వం కారణంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.హనుమంత రావు నాయక్ ను సరెండర్ చేస్తూ ఆయన స్థానంలో మరో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను నియమించాలని పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్-ఇన్-చీఫ్ ను కోరినట్లు తెలిపారు.
కాగా, నమస్తే తెలంగాణ దినపత్రికలో వరుస కథనాలపై జిల్లా కలెక్టర్ స్పందించి ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. పారిశుధ్య విభాగంలో అవకతవకలపై కథనాలకు ఇప్పటికే శానిటరీ ఇన్స్పెక్టర్ పై విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో రామగుండం కార్పొరేషన్లో ఇద్దరు అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేసిన సంఘటన మిగతా విభాగాల అధికారులను హడలెత్తించింది. కాగా, తమ ఫిర్యాదులకు స్పందించి శానిటరీ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకున్నందుకు అదనపు కలెక్టర్ తోపాటు వరుస కథనాలు ప్రచురించిన నమస్తే తెలంగాణకు మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు కృతజ్ఞతలు తెలిపారు.