సీఎం కేసీఆర్ తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ రాకముందు మన పిల్లలు వైద్య విద్యకోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో మన పిల్లలకు మనదగ్గరే మెడిసిన్ చదివే అవకాశం వచ్చింది. పైసా ఖర్చులేకుండా పేదింటి బిడ్డలు డాక్టర్లయ్యే పరిస్థితి ఉన్నది. గతంలో 850 సీట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు బీఆర్ఎస్ సర్కారు ఏకంగా 4,490 సీట్లు అందుబాటులోకి తెచ్చింది. వినూత్న సాగు పథకాలతో వ్యవసాయ విప్లవం సృష్టించి తెలంగాణను దేశానికే అన్నంపెట్టే స్థాయికి చేర్చింది. సమీప భవిష్యత్‌లో దేశప్రజలకు మెరుగైన వైద్యమందించే స్థితికి చేరుకుంటుంది.
కరీంనగర్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: ‘ఒకేరోజూ 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్న ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. సీఎం కేసీఆర్ ధృడ సంకల్పంతోనే నిరుపేద పిల్లలకు వైద్య విద్య అందే అవకాశం దక్కింది.’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గతంలో మన పిల్లలు మెడిసిన్ చదవాలంటే చైనా, పిలిఫ్పైన్స్, ఉక్రెయిన్ దేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ తెలంగాణలో జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటుతో ఇక్కడే డాక్టర్లయ్యే అవకాశం దక్కిందని పేర్కొన్నారు.
కరీంనగర్ శివారులోని కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ రాకముందు మన పిల్లలకు కేవలం 850 మెడిసిన్ సీట్లు ఉండేవన్నారు. ప్రస్తుతం ఏకంగా 4,490 పిల్లలకు వైద్య విద్య అభ్యసించే అవకాశం లభించిందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. వినూత్న పథకాలతో సాగురంగంలో విప్లవం సృష్టించిందని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. సమీప భవిష్యత్‌లో దేశ ప్రజలందరికీ మెరుగైన వైద్యమందించే స్థాయికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇపుడు ఇంటర్ బైపీసీ చదువుతున్న విద్యార్థులు.. నీట్‌కు హాజరై తెలంగాణలోని ఏదో ఒక మెడికల్ కళాశాలలో సీటు సంపాదించుకుని డాక్టర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే ఎన్నో అడ్డంకులు ఉండేవని, కేసీఆర్ ఆలోచనతో ఇపుడు ఎంతో సులభతరమైందన్నారు. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళశాలలో ఉమ్మడి జిల్లాకు చెందిన 21 మందికి సీట్లు రావడం గర్వకారణమని చెప్పారు. మెడిసిన్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి గానీ, అధికారుల దృష్టికి గానీ తీసుకురావాలని కోరారు. మొహమాటపడి సమస్యలను దాచవద్దని సూచించారు. మీ భద్రతే మా లక్ష్యమని, ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఏడాదిన్నరలో అద్భుతమైన పక్కా భవనాన్ని నిర్మించి ఇస్తామని, కరీంనగర్ పరిసరాలను ఆస్వాదించి ఉల్లాసంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి, మానేరు డ్యాం పరిసరాలు ఎంతో అహ్లాద భరితంగా ఉంటాయని, ఆట విడుపు కోసం అక్కడికి వెళ్లవచ్చన్నారు. త్వరలో మరో అద్భుతమైన మానేరు రివర్ ఫ్రంట్‌ను కూడా పూర్తి చేసి కానుకగా అందిస్తామని మంత్రి గంగుల స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్, కలెక్టర్ జీ గోపి, సీపీ సుబ్బారా యుడు, అదనపు కలెక్టర్లు, ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కళాశాల ప్రిన్సిపాల్ శీలం లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, కళాశాల సూపరింటెండెంట్ వీరారెడ్డి, కరీంనగర్ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణప్రసాద్, ఏడీ షమీమ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.