Ramagundam Baldiya | కోల్ సిటీ, జూన్ 11: ఇక్కడ అనుమతులు ఉండవు… అడిగేవారు అంతకంటే ఉండరు… ఇంకేముంది.. ఇటేటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నట్టు గోదావరిఖని నడిబొడ్డున అక్రమ నిర్మాణాలు చూస్తుండగానే ఒక్కొక్కటిగా వెలుస్తున్నాయని పలువురు వాపోతున్నారు. గతంలో స్థానిక ప్రధాన చౌరస్తా అటువైపు సింగరేణి క్వార్టర్లను అనుకొని ఉన్న దుకాణాలను అభివృద్ధి పేరుతో కూల్చివేశారు. అక్కడ దుకాణాలు కోల్పోయిన వారికి ఇటువైపు పోచమ్మ మైదానంలో ఖాళీగా ఉన్న స్థలంలో అప్పటికప్పుడే ఆరు షెట్టర్ల వరకు తాత్కాలికంగా నిర్మించి ఇచ్చారు. ఇక్కడి వరకు న్యాయంగానే ఉంది. కానీ ఇప్పుడక్కడ ఊడల మర్రిలా రోజు రోజుకూ విస్తరిస్తూ ఒక్కొక్కటిగా నిర్మాణాలు వెలుస్తుండటం అన్యాయంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
ఆ బ్యారెక్ లోని ఓ దుకాణం యజమాని ఇది చాల దన్నట్టుగా ఆ దుకాణం వెనుకాల స్థలంను సైతం ఆక్రమించి మరో నిర్మాణం చేపడుతున్నారు. కార్పొరేషన్ నుంచి ఏలాంటి అనుమతులు ఉండవు. కానీ ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ విభాగం పగ్గాలు ఓ రాజకీయ నాయకుడి చేతిలో ఉండటమే కారణమని చర్చించుకుంటున్నారు. కాగా, ఇందులో ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన ఓ వ్యక్తికి సైతం షాపు నిర్మించి ఇచ్చినట్లు సమాచారం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు… గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో రోజు రోజుకు అక్రమ నిర్మాణాలకు హద్దు లేకుండా పోతుందని పలువురు వాపోతున్నారు.
వీటిలో ఓ రైస్ డిపో దుకాణం వెనుకాల గుట్టు చప్పుడు గాకుండా అదనపు గదుల నిర్మాణం జరుగుతుంది. రామగుండం కార్పొరేషన్లో ఉన్నోళ్లకు ఒక నీతి… లేనోళ్లకు మరో రీతా? అన్నట్టు అధికారుల వ్యవహార శైలి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన వ్యాపార కూడలి లక్ష్మీనగర్‌లో లో మొబైల్ దుకాణాలు కోల్పోయి చాలా మంది వ్యాపారులు వీధిన పడిన పరిస్థితి ఉంది. వారికి ఇప్పటివరకు ఎక్కడ కూడా ప్రత్యమ్నాయం చూపించలేదని ఆవేదన చెందుతున్నారు.
అక్రమ నిర్మాణాల విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వంద్వ వైఖరి అవలంభించడం కార్పొరేషనక్కు ఇంకా అపవాదు తెచ్చిపెడుతుంది. ఏదిఏమైనా నగర పాలక ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని టౌన్ ప్లానింగ్‌ను గాడిలో పెట్టి అక్రమ అడ్డుకట్ట వేయాలని ఉందని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.