BC Azadi Federation | చిగురుమామిడి, జనవరి 12 : పద్మశాలీ సమాజం అన్ని రంగాలతో పాటు రాజకీయంలో పూర్తిగా వెనుకబడిపోయిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం పూర్తిగా కరువైందని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని కొండాపూర్, రామంచ, రేకొండ గ్రామాల్లో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఆయా గ్రామాల్లో ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనాదిగా పద్మశాలీలు రాజకీయంగా పూర్తిగా వెనుక పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.
రాష్ట్రంలో 28 లక్షలకు పైగా పద్మశాలీలు ఉన్నప్పటికీ విద్య, వైద్య, వస్త్ర ఉత్పత్తిలో రాణిస్తున్నారని, మరికొన్ని ప్రాంతాల్లో శ్రామికులుగా పనిచేస్తున్నారని అన్నారు. రాజకీయంగా ఒక్క ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎన్నిక కావడం దురదృష్టకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకం లేకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వారు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. కలిసికట్టుగా కృషి చేస్తేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు.
ప్రజాప్రతినిధిగా గెలిచిన బింగి రాజేంద్రప్రసాద్, బింగి మాధవి, వెల్దండి పద్మ, కారంపూరి తారలను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వోడ్నాల రవీందర్, మండల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు వంగర మల్లేశం, ఉప సర్పంచ్ బింగి రాజేంద్రప్రసాద్, మాజీ ఉపాధ్యక్షుడు బింగి లక్ష్మీనారాయణ, నాయకులు బింగి గణేష్, కారంపురి వెంకటేష్, బింగి శివలింగం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Padmashali has zero support from the central and state governments.. Jakkani Sanjay, founding president of BC Azadi Federation