ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ జరుగుతున్నది. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్న తరుగు పేరిట నిండా మునగాల్సి వస్తున్నది. ప్రతి బస్తాకు సంచి బరువు 250 గ్రాములు కలుపుకుని 2.200 కిలోల చొప్పున తూకం వేస్తూ క్వింటాలుకు 5.50 కిలోల మీదనే దోపిడీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రతి కేంద్రంలోనూ ఇలానే కోత పెడుతున్నా.. ఒక్కో రైతు వేలాది రూపాయలు నష్టపోతున్నా.. పట్టించుకునేవారు లేకపోవడం అన్నదాతను ఆవేదనకు గురిచేస్తున్నది. రెక్కల కష్టం మిల్లర్ల పాలవుతున్నా.. అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తున్నది.
కరీంనగర్, మే 1 (నమస్తే తెలంగాణ) : రైతులు పండించిన ధాన్యంలో తేమ, తాలు, ఇతరత్రా వ్యర్థాలు ఉండకుండా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఏక్యూ పేరిట కొన్ని నిబంధనలు విధించింది. అయితే, ప్రస్తుత కొనుగోళ్లలో తేమ శాతం మాత్రమే చూస్తూ తాలు, ఇతరత్రా వ్యర్థాలను తొలగించకుండానే కొనుగోలు కేంద్రాల్లో తూకం వేస్తున్నారు. ఈ పరిస్థితి రైతులకు అనుకూలంగా ఉందని అందరు భావిస్తున్నారు. కానీ, అక్కడే రైతులు దోపిడీకి గురవుతున్నారు. నిజానికి యంత్రాల ద్వారా వరి కోసినప్పుడే తాలు, ఇతర వ్యర్థాలు ఎక్కువగా రాకుండా ఉంటాయి.
ఆరబెట్టిన తర్వాత తేమ శాతం వచ్చిందంటే తూకం వేసుకునే స్థితిలోనే ఉంటున్నాయి. ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న కొందరు మిల్లర్లు ధాన్యం శుభ్రం చేయకున్నా తేమ శాతం చూసుకుని తూకం వేస్తే సరిపోతుందని చెబుతున్నారు. అధికారులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. నిజానికి ధాన్యం తూకం వేసినపుడు ఒక్క సంచి బరువు మాత్రమే తీసి వేయాలి. కానీ, కొనుగోలు కేంద్రాల్లో అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. తరుగు పేరిట దోపిడీ చేస్తుండగా రైతులు నిండా మునగాల్సి వస్తున్నది.
క్వింటాల్‌కు 5.50 కిలోలు అదనపు తూకం
ధాన్యం కొనుగోళ్ల సమయంలో ప్రతి బస్తా(40 కిలోల)కు 2.200 కిలోల చొప్పున క్వింటాల్‌కు 5.50 కిలోల వరకు అదనంగా తూకం వేస్తున్నారు. అందులో గన్నీ బ్యాగు బరువు 200 గ్రాములు కాగా, క్వింటాలుకు 500 గ్రాములు ఉంటుంది. కానీ, క్వింటాలుకు 5 కిలోలు తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సింగిల్ విండోలు, ఐకేపీ, డీసీఎంఎస్, హాకా.. నిర్వాహకులు ఎవరైనా, కేంద్రం ఏదైనా తరుగు పేరిట దోపిడీ జరుగుతూనే ఉన్నది.
ఒక్క కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే తరుగు పేరుతో 4.4 మెట్రిక్ టన్నులకుపైగా దోపిడీకి గురైనట్లు తెలుస్తున్నది. ఇలా జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఇలాగే దోపిడీ చేస్తున్నట్టు రైతులు వాపోతున్నారు. ప్రతి బస్తా సంచి బరువుతో కలిపి 42.200 కిలోలకు పైగా ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చే తక్ పట్టీలో మాత్రం 40 కిలోలే అని ధ్రువీకరిస్తున్నారు. ఒక రైతు వంద క్వింటాళ్ల ధాన్యం తెస్తే 40 కిలోల బ్యాగులు 250 అవుతాయి. ఒక్కో బ్యాగుకు సంచి బరువు పోగా, 2 కిలోల చొప్పున తరుగు తీస్తే 5 క్వింటాళ్ల వరకు అవుతుంది. ఈ సీజన్లో కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి 2,320 చెల్లిస్తున్నది. అంటే 5 క్వింటాళ్లకు 11,160 నష్టపోవాల్సి వస్తున్నది. అంటే ఒక్కో రైతు కష్టం మిల్లర్లకు ఏమేర చేరుతున్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
కేంద్రం ఏదైనా తరుగు దోపిడే
ప్రస్తుత సీజన్లో పీఏసీఎస్‌లు, ఐకేపీ, డీసీఎమ్మెస్, హాకా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు ఎవరైనా, కేంద్రం ఏదైనా ఒకే రీతిలో రైతులను దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాలు, ఇతర వ్యర్థాలు లేకున్నా, ఎఫ్ఏక్యూ నిబంధనలకు అనుకూలంగా ఉన్నా ఈ దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తున్నది. రైతులు అడిగితే ధాన్యం శుభ్రం చేసి ఇవ్వాలని కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ శ్రమ ఎందుకని రైతులు నిస్సహాయతను వ్యక్తం చేస్తూ తూకం వేసేందుకు అంగీకరిస్తున్న తీరు కనిపిస్తున్నది. ఒక్క కరీంనగర్ జిల్లాలో దోపిడీకి గురైన ధాన్యం విలువ కనీస మద్దతు ధరతో లెక్కించినా కొన్ని కోట్లలోనే ఉండే అవకాశమున్నది.
కేంద్రాల్లో రైతుల నిరీక్షణ
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. హమాలీల కొరత కూడా కనిపిస్తున్నది. ఒక్కో కేంద్రానికి రోజుకు పది నుంచి పది హేను మంది రైతులు తమ ధాన్యం తీసుకుని వస్తుండగా నలుగురైదుగురు రైతులకంటే ఎక్కువ మందికి సంబంధించిన ధాన్యం తూకం వేయలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు టోకెన్లు ఇస్తున్నారు.
పరిస్థితిని పసిగడుతున్న కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి మామూళ్లు కూడా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా వచ్చిన రైతులు ప్రశ్నిస్తే ధాన్యం బాగా లేదనో, ఇంకా తేమ ఉందనో సాకులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇక హమాలీ ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వస్తున్నది. క్వింటాలుకు 50 చొప్పున హమాలీ తీసుకుంటున్నారు. వీటిని గతంలో ప్రభుత్వమే భరించేది. రైతులు ముందుగా చెల్లించినా తర్వాత వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.
అధికారులు ఏం చేస్తున్నట్టు?
ధాన్యం కొనుగోళ్లలో పెద్ద మొత్తంలో దోపిడీ జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రైతుల నుంచి అదనంగా తూకం వేస్తున్న విషయం అధికారులు, మిల్లర్ల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాతనే ఇలా జరుగుతోందనే ఆరోపణలు సైతం లేక పోలేదు. గతంలో రైతులు తూకానికి ముందు ధాన్యాన్ని శుభ్రం చేసేందుకు కొనుగోలు కేంద్రాలకు ఫ్యాన్లు పంపిణీ చేశారు. మిల్లర్లతో కుమ్మకైన కారణంగా ఇప్పుడు వాటిని పక్కన పడేశారు. రైతులకు శ్రమ తప్పుతుందనే సానుభూతి వచనాలు పలుకుతుండగా ఇది తమ పరిధిలోని విషయం కాదని కొనుగోళ్లకు ప్రధాన ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఓ శాఖ అధికారులు చెబుతున్నారు.
నిజానికి అధికారులు తలుచుకుని ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు జరిపితే రైతుల శ్రమ దోపిడీకి గురయ్యేది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు సుమారు 80 వేల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు జరిగాయి. అందులో 4.4 మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా వెళ్లినట్లు తెలుస్తోంది. లక్ష్యం మేరకు కొనుగోళ్లు జరిగితే ఎంత దోపిడీ జరుగుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికారులు ఈ పద్ధతిని అరికట్టి రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
ఏం చేయలేని పరిస్థితి మాది
నేను 103 బస్తాల వడ్లు అమ్మిన. 42 కిలోలు పెట్టి 40 కిలోలు రాసిస్తున్నరు. ఏమన్నా అంటే వడ్లు పట్టిచ్చి ఇయ్యిండ్రి అంటున్నరు. ఎండల ఎందుకు ఆ కష్టమని రైతులు సప్పుడు చేస్తలేరు. ఒక్కో రైతు బాగనే లాస్ అవుతున్నడు. జరిగేది అందరికీ తెలుసు. అడిగెటోళ్లు ఎవరున్నరు.
– మారం అంజయ్య, రామకృష్ణకాలనీ
వడ్లు తెచ్చి నాలుగు రోజులైతంది
కేంద్రానికి వడ్లు తెచ్చి నాలుగు రోజులైతంది. రేపు మాపు అంటున్నరు. నాకు నాలుగు ట్రాక్టర్లు ఎల్లినయి. 150 బస్తాలు అయితండచ్చు. తరుగు తీత్తుండ్రట. నాకో 300 కిలోలు పోతయి. ఏం చేసుడు. తరుగు తియ్యద్దని అంటే కొనెటట్టు లేరు. మరి యాడికివోయి అమ్ముకునుడు? ఏం చేసేది లేక ఎంతకో అంతకు అమ్ముకుంటున్నం. వడ్లు గల్లర గల్లర అయినంకనే కొంటున్నరు. గింత పెల్లసుత లేదు. ఉంటె ఇంత తాలు, చెత్త ఉంటది. అది సుతం సంచికి కిల ఎల్లది. అయినా గిట్ల జేత్తండ్రు? తెలిసి సుతం ఇక్కడన్నే అమ్ముకునడైతందంటే మా పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి.
– బోల్ల బాలయ్య, రామకృష్ణకాలనీ