సారంగాపూర్, ఏప్రిల్ 30 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తున్నది. ఫలితంగా తూకం వేయడంలో జాప్యం జరుగుతున్నది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. సారంగాపూర్ మండలంలోని రేచపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత ఉండడంతో ఉన్న కొద్ది మందితో రోజుకో సెంటర్లో ధాన్యం తూకం వేస్తున్నారు. దీని వల్ల కొనుగోళ్లలో జాప్యం జరిగి రైతులు పడిగాపులు గాస్తున్నారు. ధాన్యం తేమశాతం వచ్చినప్పటికీ రోజుల తరబడి కుప్పల వద్దనే ఉండాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల ముప్పుతో ఆందోళన చెందుతున్నారు. రేచపల్లి సెంటర్లో ప్యాడీ క్లీనర్ కూడా లేక ఇబ్బందులు వాపోయారు. అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని వేడుకుంటున్నారు.
కొనుగోలు కేంద్రంలో హమాలీల కొరత ఉన్నది. తూకం వేయడంలో జాప్యం జరుగుతున్నది. ధాన్యం తేమశాతం వచ్చినా తూకం వేయకపోవడంతో రోజుల తరబడి కుప్పల వద్దనే పడిగాపులు కాస్తున్నం. అధికారులు స్పందించాలి. సరిపడా హమాలీలను తీసుకురావాలి.
హమాలీలు లేక తూకం వేసిన 400 ధాన్యం బస్తాలు నాలుగైదు రోజులుగా సెంటర్లోనే ఉన్నయి. అకాల వర్షాలతో ఆగమైతున్నం. ధాన్యాన్ని కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నం. వాతావరణంలో మార్పులు వస్తున్నందున తూకం వేసిన ధాన్యం మిల్ల్లులకు తరలించాలి.
కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసేందుకు భూమి చదును చేయలేదు. ప్యాడీ క్లీనర్ ఏర్పాటు చేయలేదు. శుభ్రం చేసిన ధాన్యం 41 కిలోలు, శుభ్రం చేయని ధాన్యం 42 కిలోల చొప్పున తూకం వేస్తున్నారు. అధికారులు స్పందించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి.