పెద్దపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/పెద్దపల్లి కమాన్: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ కనపడడం కలకలం రేపుతున్నది. ఓ నలుగురు విద్యార్థులు గంజాయి తాగి పట్టుబడినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మత్తు వలలో ఇంకెంత మంది పిల్లలు ఉన్నారు? విషయం చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఓ నలుగురు పదో తరగతి విద్యార్థులు ఆగస్టులో డ్రగ్స్ ప్యాకెట్లను తమ బ్యాగుల్లో పెట్టుకొని స్కూల్‌కు వచ్చారు.
బ్రేక్ టైంలో స్కూల్ వెనుక పొలాల దగ్గరికి వెళ్లి గంజాయి తాగడాన్ని స్థానికులు గమనించారు. ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో వారు విద్యార్థుల బ్యాగ్స్, పుస్తకాలను తనిఖీ చేశారు. గంజాయి ప్యాకెట్లు బయటపడడంతో కంగుతిన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలు తాగినట్టు నిర్ధారణ కావడంతో వారిని బెదిరించి, తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడి వదిలేశారు. ఈ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్తలు పాటించారు.
అయితే పిల్లలకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు ఇచ్చారన్న విషయాన్ని మాత్రం వదిలేశారు. ఇప్పటి వరకు పాఠశాలలో నలుగురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. డ్రగ్స్ విషయం గ్రామంలో తెలియడంతో మిగతా పిల్లల తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ఈ విషయమై కమాన్‌పూర్ ఎస్ఐ ప్రసాద్‌ను సంప్రదించగా.. స్కూళ్లలో డ్రగ్స్ వాడుతున్నట్టు తమ దృష్టికి రాలేదని, సమాచారం వస్తే పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు.