మెట్పల్లి రూరల్, జూలై 2: మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో మళ్లీ కలకలం రేపింది. గత విద్యాసంవత్సరం ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం, పలువురు అస్వస్థతకు గురైన ఘటనలు మరువకముందే, తాజాగా బుధవారం మరో విద్యార్థి స్వల్ప అస్వస్థతకు గురికావడం కలవరపెడుతున్నది.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దాపూర్ గురుకులంలో 8వ తరగతి చదువుతున్న నవనీత్ అనే విద్యార్థి బుధవారం రాత్రి తన కుడి కాలి పాదం పైభాగంలో రక్తం వచ్చినట్లు గుర్తించాడు. కొద్దిసేపటి తర్వాత మంట వచ్చినట్లు అనిపించడంతో ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ మాధవీలతకు తెలిపాడు. దీంతో ఆ విద్యార్థిని చికిత్స కోసం కోరుట్లలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. కాగా పరీక్షించిన వైద్యులు విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.