కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 24 : సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రాంతం కరీంనగర్ అని, చాలా సుందరంగా రూపుదిద్దుకుంటున్నదని, రాబోయే రోజుల్లో ఇక్కడ సినిమా పరిశ్రమకు అనువైన సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని లక్ష్మీనగర్‌లో జీ మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఫ్రెండ్లీ ఘోస్ట్ చిత్ర షూటింగ్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నటీనటులు, డైరెక్టర్‌తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కరీంనగర్‌లోని మానేరు తీరం, పలు పార్కులు, ఐటీ హబ్, హోటళ్లు షూటింగ్‌కు అనువుగా ఉన్నాయన్నారు. ఇక్కడ కళాకారులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారికి అవకాశాలు కల్పిస్తూ ఆదరించాలని కోరారు. స్థానిక కళాకారులు ఆర్ఎస్ నంద, సుమన్‌గౌడ్, రామ్ మొగిలోజుతోపాటు పలువురికి ఇందులో అవకాశం కల్పించినందుకు డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డిని అభినందించారు. అనంతరం యూనిట్ సభ్యులు చిత్రీకరిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. కాగా, నల్గొండ జిల్లాకు చెందిన మధుసూదన్ రెడ్డి గతంలో రుద్రవీర్, పెండ్లికి ముందు ప్రేమ సినిమాలకు దర్శకత్వం వహించారు. షూటింగ్లో ఆయనతో పాటు హీరో సత్యం రాజేశ్, హీరోయిన్ రియా, నటీనటులు మధునందన్, శ్రీనివాస రెడ్డి, జబర్దస్త్ ఫేమ్ సత్తిపండు, కార్తీక దీపం ఫేం సుజాత, సునీత పాల్గొన్నారు.