కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం నిర్వహణ సరిగ్గా లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రోజుల తరబడి కళాశాల ప్రిన్సిపాల్ విధులకు హాజరు కాకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతిన్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళాశాలకు హెడ్‌గా ఉన్న ప్రిన్సిపాలే కాలేజీకి గైర్హాజరవడంతో ఇతర సిబ్బంది కూడా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ప్రిన్సిపాల్ వచ్చినప్పుడే విధులకు హాజరవుతూ హడావుడి చేస్తున్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్‌లో ఉంటున్న కొంత మంది ఫ్యాకల్టీస్ కూడా విధులకు హాజరు కాకపోవడంతో ఎస్ఆర్లతోనే క్లాస్‌లు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.
కరీంనగర్ విద్యానగర్, మే 6 : కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏడాదిన్నర కిందట అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సదుద్దేశాలతో ఏర్పాటు చేసింది. సొంత భవనం లేక పోవడంతో 7 కోట్లు వెచ్చింది తాత్కాలిక భవనాన్ని సమకూర్చింది. అందులో తరగతులు నిర్వహిస్తుండగా పక్కా భవనానికి కూడా అప్పటి ప్రభుత్వమే నిధులు మంజూరు చేసింది.
ఈ భవనం కూడా నిర్మాణంలో ఉన్నది. ఇంత వరకు బాగానే ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం మారిన తర్వాత ఈ కళాశాలను పట్టించుకునే వారు కరువయ్యారు. రెండో సంవత్సరంలోకి అడుగు పెట్టినా ఈ కళాశాలకు సరైన ఫ్యాకల్టీస్ కూడా అందుబాటులో లేరు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇంకా మకాం మార్చని ప్రిన్సిపాలే నెలలో ఒకటి రెండు రోజులే విధులకు హాజరవుతున్నారు.
దీంతో ఫ్యాకల్టీస్ కూడా విధులకు హాజరు కాకపోవడంతో వైద్య విద్యార్థులకు తరగతుల నిర్వహణ కష్టతరంగా మారింది. సీనియర్ రెసిడెంట్స్ (ఎస్ఆర్)తోనే తరగతులు నిర్వహించాల్సి వస్తున్నది. అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ ఎవరూ సరిగ్గా విధులకు హాజరు కావడం లేదు. ఫ్యాకల్టీస్గా ఉన్న చాలా మంది హైదరాబాద్ నుంచే విధులకు హాజరవుతున్నారని తెలుస్తున్నది. వారానికి ఒక రోజు కూడా విధులకు హాజరు కాకపోవడంతో ఎస్ఆర్లే వైద్య విద్యార్థులకు బోధిస్తున్నారు.
జాడ లేని ప్రిన్సిపాల్?
కళాశాలకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రిన్సిపాలే సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని తెలుస్తున్నది. కళాశాల ప్రారంభంలో ఉన్న ప్రిన్సిపాల్ బదిలీపై వెళ్లడంతో మరొకరిని నియమించారు. అప్పటి నుంచి నెల రెన్నెళ్లు కూడా విధులకు సరిగ్గా హాజరు కాలేదని సమాచారం. ప్రిన్సిపాల్ కుర్చీ ఎప్పుడు చూసినా ఖాళీగానే కనిపిస్తున్నది. అయితే, ఈ ప్రిన్సిపాల్‌కు కొందరు అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది వంత పాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
గత జూన్‌లో చార్జి తీసుకున్న ప్రిన్సిపాల్ నెలలో రెండు, మూడు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నట్లు తెలుస్తున్నది. ప్రిన్సిపాల్‌కు వంత పాడుతున్న సిబ్బంది కూడా విధులకు హాజరు కావడం లేదని సమాచారం. ప్రిన్సిపాల్ విధులకు వస్తున్న రోజునే వీరంతా కళాశాలలో హంగామా చేస్తుంటారని సమాచారం. కొందరు సిబ్బంది వారం పది రోజులకు ఒకసారి విధులకు హాజరవుతూ ఒకేసారి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఆదివారం కూడా సంతకం చేసి ఆ తర్వాత కొట్టేసినట్టు అటెండెన్స్ రిజిస్టర్లో కనిపించింది.
నామమాత్రంగా బయోమెట్రిక్
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్ధులకు, ఉద్యోగులకు వేర్వేరుగా బయోమెట్రిక్ ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ బయోమెట్రిక్ పెడితేనే విద్యార్థులు తరగతులకు, ఉద్యోగులు విధులకు హాజరైనట్టు నమోదవుతుంది. అయితే, ఇక్కడ ప్రిన్సిపాలే విధులకు హాజరు కాకపోవడంతో బయోమెట్రిక్ గురించి పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. బయోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి వేతనాలు చేయాలి. కానీ, ఈ కళాశాలలో మా త్రం బయోమెట్రిక్‌తో సంబంధం లేకుండా వేతనాలు ఇస్తున్నట్లు తెలుస్తున్నది.
ఈ నేపథ్యం లో డీఎంఈ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. పూర్తిగా పర్యవేక్షణ కొరవడి విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. ప్రిన్సిపాల్‌కు సన్నిహితంగా ఉండే ఫ్యాకల్టీస్, సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో కళాశాలలో తరగతుల నిర్వహణతోపాటు అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తిగా దెబ్బతిన్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ యంత్రాలను పరిశీలిస్తే ఎవరు ఏ రోజు విధులకు హాజరవుతున్నారనే విషయాలు తెలిసే అవకాశాలుంటాయి. డీఎంఈ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకుంటే గానీ కళాశాల గాడిన పడే పరిస్థితి కనిపించడం లేదు.