Korutla | కోరుట్ల, సెప్టెంబర్ 25: ఏదైనా సాధించాలనే తపన పట్టుదలతో పాటు తగిన విధంగా శ్రమిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని కోరుట్ల కు చెందిన దురిశెట్టి విజయకుమార్ నిరూపించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి మెట్ పల్లి లోని ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తూ మరింత మంచి హోదాలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకొని ఎట్టకేలకు విజయతీరాలకు చేరుకోగలిగాడు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-1ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసిన పరీక్ష ఫలితాలలో 176వ ర్యాంకు సాధించి జైళ్ల శాఖ డీఎస్పీగా ఎంపికై ఆదర్శంగా నిలిచాడు.
విజయ్ కుమార్ కుటుంబ నేపథ్యం..
జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన దురిశెట్టి సత్యనారాయణ, జమునారాణి దంపతులకు కొడుకు విజయ్ కుమార్, కూతురు దివ్య ఉన్నారు. తండ్రి సత్యనారాయణ జువెలరీ షాప్ నిర్వహిస్తుండగా తల్లి జమున రాణి గృహిణి. కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్, విజయ్ కుమార్ కు భార్య వసంత ఉన్నారు. బీటెక్ పూర్తి చేసిన వసంత ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నారు.
విద్యభ్యాసం..
విజయ్ కుమార్ పదో తరగతి వరకు కోరుట్లలోని ఎస్ఎఫ్ఎస్ హైస్కూల్, హైదరాబాద్లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్, ఎన్ఐటీ ఢిల్లీ లో బీటెక్ పూర్తి చేశారు.
ప్రభుత్వ కొలువు చేస్తూనే..
విజయ్ కుమార్ మెట్పల్లిలోని ఆర్టీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. చదువుకున్న రోజుల్లోనే ప్రభుత్వ ఉన్నతాధికారి హోదాలో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. ఢిల్లీలోని ఓ ఇన్స్టిట్యూట్లో సివిల్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకున్నాడు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ వన్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి జైళ్ల శాఖలో డిఎస్పీగా ఉద్యోగం సాధించాడు. కుమారుడు డీఎస్పీకి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.