తమ గ్రామాన్ని పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించాలని గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు పోరుబాట పట్టారు. కమిటీలు, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో కాలయాపన చేస్తున్నారని, దొడ్డిదారిన కేవలం 42 ఇండ్లకే పరిహారం ఇవ్వడానికి మార్కింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం గ్రామాన్ని తీసుకునే వరకూ తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇది వరకే కరీంనగర్ ప్రజావాణిలో వినతి ఇచ్చిన గ్రామస్తులు, సోమవారం మరోసారి ఇచ్చారు. అక్కడితో ఆగకుండా కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించి ఆందోళన చేశారు. రిజర్వాయర్ డీపీఆర్ బహిర్గతం చేయాలని, ఆ తర్వాతే గ్రామసభ పెట్టాలని డిమాండ్ చేశారు. చివరకు అధికారులతో హామీతో ఆందోళన విరమించారు.
గంగాధర/ కరీంనగర్ కలెక్టరేట్, మే 25: పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌ను నీటిని నింపి, ఇక్కడి చొప్పదండి నియోజకవర్గంతోపాటు వేములవాడ మండలానికి సాగునీరు అందిస్తారు. అయితే రిజర్వాయర్‌ను నింపిన ప్రతిసారీ కట్ట ప్రమాదకరంగా మారి గ్రామస్తులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఇదే సమయంలో ప్రాజెక్టులో నీటి నిల్వలున్న రోజులు జాలువారుతున్నదని, గ్రామం మొత్తం బురదమయంగా మారుతుందని, వ్యవసాయభూముల్లో ఎలాంటి పనులు చేసుకోలేని, అలాగే ఇండ్లలో కూడా ఉండలేని పరిస్థితులు ఉంటున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.
ఇటీవలి కాలంలో కట్ట ఎత్తును పెంచడానికి రిజర్వాయర్ పక్కనే ఉన్న 42 ఇండ్లను తీసుకొని, పరిహారం చెల్లించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. మొత్తం గ్రామాన్ని ముంపుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వెళ్లి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అప్పుడు కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో మహేశ్వర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ నారాయణపూర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేయగా, మొత్తం గ్రామాన్ని ముంపుగా తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఆ మేరకు కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని తెలిపిన అధికారులు, తిరిగి మళ్లీ విషయాన్ని మొదటికి తెచ్చారని మండిపడుతున్నారు. కొద్ది రోజులుగా దొడ్డిదారిన ఇండ్లకు మార్కింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే 42 ఇండ్లకు పరిహారం ఇవ్వడానికి సంబంధించి మంగళవారం గ్రామసభ నిర్వహిస్తున్నట్టు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీసులు అంటించడంపై ఆగ్రహించారు. మరోసారి అందరూ ఏకమై సోమవారం కలెక్టరేట్‌కు వెళ్లారు. నారాయణపూర్ రిజర్వాయర్ డీపీఆర్ నివేదికను బహిర్గతం చేయాలని, అప్పటిదాకా ముంపు గ్రామసభ నిర్వహించకూడదని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. దీనిపై అధికారులను వివరాలడిగి తెలుసుకుంటానంటూ సంబంధిత అధికారి వివరించగా, గ్రామస్తులు సంతృప్తి చెందక ఆడిటోరియం బయట బైఠాయించారు.
గతంలో అధికారులు సమగ్ర సమాచారం అందించిన అనంతరమే గ్రామసభ ఏర్పాటు చేస్తామంటూ లిఖితపూర్వకంగా రాసిచ్చారని, కానీ ఆ వివరాలు ఇవ్వలేదని ఆగ్రహించారు. ఆ వివరాలు ఇవ్వాలని, డీపీఆర్‌ను బయట పెట్టాలని, ఆ తర్వాతే మిగతా గ్రామ సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్ అక్కడకు వచ్చి గ్రామసభలోనే సమస్యలు, పరిష్కర మార్గాలపై చర్చిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనుదిరిగారు.