Godavarikhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 22 : ఒకరు ప్రాణం లేని బొమ్మతో మాట్లాడిస్తారు.. మరొకరు గాలిలో పావురాలు సృష్టిస్తారు.. ఇంకొకరు కాగితాలను కరెన్సీగా మార్చడం.. గాలిలో మనిషిని పడుకోబెట్టడం.. ఇలాంటి అద్భుతాలు సృష్టించడంలో రామగుండం కోల్ బెల్ట్ మాంత్రికులుగా ఈ త్రిమూర్తులు పేరు గడించారు. కానీ అదేమి మాయలు, మంత్రాలు కాదు… ఆదొక ఇంద్రజాల విద్య.. పట్టుదల, ఆత్మవిశ్వాసంను కలబోసి సాధన చేయగా వచ్చిన కళాత్మక విద్య. ఈ ఇంద్రజాల ప్రదర్శనలో తమదైన ప్రతిభతో మనమేమి తక్కువ కాదని ఈ మాంత్రికులు నిరూపిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30 మంది ఇంద్రజాలికులు ఉండగా, గోదావరిఖని నుంచి త్రిమూర్తులుగా మేజిక్ రాజా, మేజిక్ హరి, మేజిక్ అలాడీన్ లు వింతలు, అద్భుతాలతో ఇప్పటికీ అలుపెరుగని ప్రయాణం సాగిస్తున్నారు. భారతీయ ఇంద్రజాలికులు పిసి సర్కార్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 23న ఇంద్రజాల దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో సోమవారం నాడు కరీంనగర్ తీగల గుట్టపల్లి వద్ద పెద్ద ఎత్తున ఇంద్రజాల ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖనికి చెందిన ఆ త్రిమూర్తుల గురించి మరోసారి నమస్తే తెలంగాణ పరిచయం చేస్తుంది.
ఇంద్రజాలంలో ‘రాజా’ ది గ్రేట్..
గోదావరిఖనికి చెందిన రాజా ఇంద్రజాలంలో దిట్ట. తన ఇంటి పేరునే మేజిక్ గా మార్చుకొని మేజిక్ రాజాగా సుపరిచితుడయ్యాడు. గోదావరిఖనికి ఇంద్రజాల ప్రదర్శనను పరిచయం చేసిన వ్యక్తి ఇతనే. ఆంధ్రప్రదేశ్ మెజీషియన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఇతని ప్రతిభకు గుర్తుగా ‘ఇంద్రజాల రత్న, మేజిక్ రత్న అవార్డులు దక్కించుకున్నాడు. విజయవాడ నాస్తిక సమాజంలో రెండు రోజుల పాటు జరిగిన సైన్స్ మేజిక్ ఫెస్టివల్, గుంటూరు లో రెండు రోజుల పాటు జరిగిన 30వ రాష్ట్ర ఇంద్రజాల మహోత్సవంలో తన అద్భుత వ్యాఖ్యానంతో అందరినీ ఆకట్టుకోవడంతో ‘హాస్యనిధి అనే అవార్డు కూడా ఇచ్చారు. చక్కని వ్యాఖ్యాతగా పేరుంది.
సింగరేణి ఆణిముత్యాలు.. ఈ మాంత్రికులు..
ఇక మేజిక్ హరి, అలాడీన్లు సింగరేణి ఆణిముత్యాలుగా పేరు సంపాదించారు. ప్రవృత్తిగా ఇంద్రజాల విద్యలో ఆరితేరారు. వీరిరువురు గాలిలో పావురాలు తీయడం, గొడుగులను సృష్టించడం.. కళ్లకు గంతలతో ద్విచక్ర వాహనాలను నడపడం.. బ్లేడ్లను మింగి బయటకు తీయడం, సిగరేట్లను సృష్టించడం, ముక్కలైన వస్తువులను అతికించడం లాంటి విద్యలు ప్రదర్శిస్తూ భలే మాంత్రికులుగా పిలిపించుకుంటున్నారు. 2018లో సికింద్రాబాద్ లో ఛూ మంతర్ మేజిక్ ఆసియా పోటీల్లో మేజిక్ హరి పాల్గొని అనేక విన్యాసాలతో ఉత్తమ మెజీషియన్ గా అవార్డు అందుకున్నారు. సింగరేణి సంస్థ తరపున కూడా అనేక అవార్డులు గెలుచుకున్నారు. ఇక అలాడీన్ 2011లో గుంటూరులో ఒకే వేదికపై రెండు ప్రదర్శనలు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి అందుకున్నాడు. పశ్చిమ గోదావరిలో తన ప్రతిభతో మ్యాజిక్ ప్రిన్స్ అవార్డు తీసుకున్నాడు. సింగరేణి సంస్థ ఏటా నిర్వహించే సంస్థ వార్షికోత్సవ వేడుకల్లో అలాడీన్, హరి ప్రదర్శనలు కచ్చితంగా ఉండాల్సిందే. దాంతో సింగరేణి సంస్థ వీరికి సింగరేణి మాంత్రికులు అనే బిరుదు కూడా ఇచ్చింది.. 2010లో వరంగల్ లో జరిగిన ఇంద్రజాల ఉత్సవంలో అలాడీన్ మొదటి ప్లేసులో నిలిచాడు. ప్రదర్శనల ద్వారా వచ్చిన కొంత మొత్తంను పూర్తిగా పేదలకు వృద్ధులకు అందజేయడం ఆయనలోని మరో సామాజిక దృక్పథం.
తండ్రికి తగ్గ తనయ..
అలాడీన్ కూతురే అస్మా యాసీనా. చిన్నప్పటి నుంచి తండ్రి. అలాడీన్ చేస్తున్న ఈ విద్యలే యాసీనాను ప్రభావితం చేశాయి. అలాడీన్ ఎక్కడ ప్రదర్శనలు ఇచ్చినా వెంట వెళ్లేది. అప్పుడప్పుడు తాను ఈ విద్యలను ప్రయత్నించేది. యాసీనాకు ఉన్న ఆసక్తిని గుర్తించిన తండ్రి అలాడీన్ మరింతగా ప్రోత్సహించాడు. యాసీనా 8వ తరగతిలో ఉండగా 2012 గుంటూరులో జరిగిన 29వ రాష్ట్ర స్థాయి ఇంద్రజాల ప్రదర్శనలో జూనియర్ విభాగంలో పాల్గొంది. ఐతే అక్కడ జూనియర్ కళాకారులెవ్వరూ రాకపోవడంతో ఆ విభాగంను రద్దు చేసింది. కానీ యాసీనా మాత్రం వెనుదిరగకుండా సీనియర్ విభాగంలో పాల్గొని 20 మంది కళాకారులను ఓడించి తన ప్రదర్శనలతో ఫస్ట్ ప్లేస్ సాధించింది. మండుతున్న క్యాండిల్ ను పూలుగా చేయడం, గాలిలో గొడుగులు, పావురాలు సృష్టించడం, కాగితాలను ముక్కలుగా చేసి అతికించడం తదితర ఇంద్రజాల విద్యలో చిన్న వయసులోనే రాణించడం పలువుర్ని అబ్బురపరిచింది.