AADI SRINIVAS | కథలాపూర్, ఏప్రిల్ 12 : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆది శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. అలాగే మండల కేంద్రంలో శ్రీ గుంటి పెరుమల్ల ఆంజనేయ స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్ పాల్గొని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు.
రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం కొనుగులు కేంద్రాలను వారికి కేటాయించారని వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరుపున అందిస్తున్నామని తెలిపారు.
రైతులకు ఏక కాలంలో రైతు ప్రయోజనాలు కోసం 21 వేల కోట్ల మేర రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. సన్న వడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ క్వింటాల్ కు అదనంగా రూ.500 ఇస్తున్నదని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలని, సరిపడా టార్పలిన్ కవర్లు, గన్ని సంచులు,ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని విప్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు ఫ్లెక్సీలు కట్టి మేం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, బీజేపీ పంపిణీ చేస్తే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు.