Students carrying milk packets | మెట్ పల్లి, జూలై18: మెట్ పల్లి పట్టణంలోని మహాత్మ జ్యోతిబా బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులు అటెండర్ విధులను నిర్వహించక తప్పడం లేదు. చదువుకోవాల్సిన విద్యార్థుల చేత కూరగాయలు, పాల ప్యాకెట్లు ఇతరత్రా సామగ్రిని మోపిస్తుండడం కలకలం రేపుతోంది. నిజానికి కూరగాయలు, పాల ప్యాకెట్లు, కోడిగుడ్లు కాంటాక్ట్ తీసుకున్న వ్యక్తులు గురుకుల పాఠశాలలో చేరవేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం కాంట్రాక్టర్ వాహనాన్ని గురుకుల పాఠశాలకు ముందు రోడ్డు పక్కన నిలిపి అందులోని సామగ్రిని తన మనుషులకు బదులుగా విద్యార్థుల చేత గురుకుల పాఠశాల లోనికి చేరవేయడం ప్రతీరోజు పరిపాటిగా మారింది. శుక్రవారం ఉదయం రోడ్డు పక్కన నిలిపిన వాహనం నుంచి పాల ప్యాకెట్ల బాక్స్‌లను విద్యార్థులు మోసుకెళ్తున్న వైనం ‘నమస్తేతెలంగాణ’ కంట పడగా క్లిక్మనపించింది.