BRS | కోరుట్ల, ఆగస్ట్ 2: కోరుట్ల నియోజకవర్గం పోరాటల పురిటి గడ్డ అని, కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడరని తాజా మాజీ సర్పంచ్‌లు కోరెపు రవి, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ శనివారం కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. రైతులకు సరిపడా యూరియా బస్తాలు సరఫరా చేయడం లేదని, అరకోర యూరియా సరఫరా రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందన్నారు. రైతులు ఎదుర్కోంటున్న సమస్యలపై కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నిజాలు ప్రస్తావించారని చెప్పారు.
కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే, అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసరడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి, సవాళ్ల పేరుతో గందరగోళం సృష్టించడమే నాన్ లోకల్ నాయకుల ఆసలు ఎజెండా అని వారు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజా సేవతో సంబంధం లేదని, కుర్చీపై ఆశతోనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి ధైర్యవంతులైన బీఆర్ఎస్ నాయకులు వెన్నంటి ఉన్నారన్నారు. ప్రజా సమస్యలపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా గళం వినిపిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ నాయకుల వెంట 10 మంది కార్యకర్తలు కూడ లేరని ఎద్దేవా చేశారు. ప్రజల ముందుకు రావడానికి కాంగ్రెస్ నాయకులకు అర్హత లేదని పేర్కొన్నారు. సవాళ్ల పేరుతో కాంగ్రెస్ నాయకులు హంగామా సృషిస్తున్నాని ఆరోపించారు. చర్చకు పిలిచి పోలీసులను పెట్టి అడ్డుకోవడం విచిత్రంగా ఉందన్నారు. ఎమ్మెల్యేను విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. ఎన్ని అవరోధాలు సృష్టించిన రైతు సమస్యలపై ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సజ్జు, పేర్ల సత్యం, బండి భూమయ్య, పొట్ట సురేందర్, అన్వర్, అమేర్, నత్తి రాజ్‌కుమార్, చిత్తరి ఆనంద్, శేఖర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.