Singareni | గోదావరిఖని :సింగరేణి లో కొత్త గనులు రావడం కోసం, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తదితర డిమాండ్ లపై ఈ నెల 20 న దేశవ్యాప్త సమ్మె ను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు కోరారు. సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, ఐఎన్టీయుసి నాయకులు గడ్డం క్రిష్ణ, సిఐటియు నాయకులు నాగరాజు గోపాల్, టిబిజికేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, ఐఎఫ్టీయు నాయకులు కే.విశ్వనాథ్ సోమవారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె ఓసిపి 5 లో జరిగిన గేట్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందని వారు ఆరోపించారు. దీని వల్ల ఇప్పుడు కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక హక్కులు హరించిపోతాయని. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్ లను కోల్ ఇండియా కు మరియు సింగరేణి కి కేటాయించకుండా వేలం పాట ద్వారా ప్రైవేటు కు ఇస్తున్నారని వారు విమర్శించారు. ఇప్పటికే దాదాపు 160 కి పైగా బొగ్గు బ్లాకులను ప్రైవేటు కు ఇచ్చారని వారు ఆరోపించారు. సింగరేణి కి వేలం పాట లేకుండా కొత్త గనులు వస్తనే మనుగడ కొనసాగుతుందని లేకుంటే యువ కార్మికుల కు ఉద్యోగ భద్రత ఉండదని వారు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20 న దేశవ్యాప్త సమ్మె ను సింగరేణి లో జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమ్మె లో దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు తదితర సంస్థలు పాల్గోంటున్నాయని, సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు కూడా పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.
ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోషం, మాదన మహేష్, రంగు శ్రీను, గండి ప్రసాద్, బోగ సతీష్ బాబు, గుర్రం ప్రభుదాస్, ఉదయ భాను, చంద తిరుపతి, గండ్ర దామోదర్ రావు, కే.శంకర్, మెండె శ్రీనివాస్, రాజ మౌళి, గౌస్, వడ్డెపెల్లి శంకర్, నూనె కొంరయ్య, పర్లపెల్లి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు పహాల్గాన్ లో ఉగ్రవాదుల దాడుల మృతి చెందిన వారికి, భారత్ పాక్ యుద్ధం లో మరణించిన సైనికుల కు సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు.