Nandi Medaram | ధర్మారం, నవంబర్ 3: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూరితంగా నిర్మించిన శిలాఫలకం గోడ తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ఎంపీడీవో, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా శిలా పలకాన్ని భవన నిర్మాణ స్థలం వద్ద శంకుస్థాపన కోసం శిలాఫలకం ఏర్పాటు చేయాల్సి ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలోని నంది యూత్ క్లబ్ ఎదుట తమ పార్టీ జెండా గద్దె వద్ద పక్కన శనివారం శిలాఫలకం గోడ నిర్మించడంతో బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం చెప్పిన విషయం విధితమే.
ఈ విషయంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో శిలాఫలకం ఏర్పాటు విషయాన్ని ఎంపీడీవో వద్ద పరిష్కరించుకోవాలని స్థానిక ఎస్సై శనివారం రాత్రి ఇరు వర్గాలకు సూచించారు. దీంతో తమ జెండా గద్దె వద్ద నిర్మించిన శిలాఫలకం గోడను తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సోమవారం స్థానిక ఎంపీడీవో ఐనాల ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. గ్రామంలో నిర్మించే మహిళ సమాఖ్య భవన నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని కానీ తమ పార్టీ జెండా గద్దె వద్ద నిర్మించిన శిలాఫలకం గోడ నిర్మాణాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని వారు ఎంపీడీవోకు వివరించారు.
తమ జెండా గద్దె వద్ద నిర్మించిన శిలాఫలకం తొలగించి శంకుస్థాపన చేసే మహిళా సమాఖ్య భవనం వద్ద దానిని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవో కు వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నంది మేడారం మాజీ ఎంపీటీసీ మిట్ట తిరుపతి, పార్టీ నాయకులు మిట్ట భరత్, నేరెళ్ల చిన్న లచ్చయ్య, మిట్ట సత్తయ్య, మానుపాటి సాగర్, రాచూరి రవీందర్, మేకల బాల కొమురయ్య, గోళ్ల సంతోష్, కూనారపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.