కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 26 : మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలకు ఆయా జిల్లాల లోకల్ బాడీ అదనపు కలెక్టర్లను ప్రత్యేకాధికారులుగా నియమించింది. కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేయడంతో దానికి ప్రత్యేకాధికారిని నియమించలేదు.
కరీంనగర్‌లోని చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారిగా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ప్రపుల్ దేశాయ్, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) జే అరుణశ్రీ, రామగుండం నగరపాలక సంస్థకు కలెక్టర్ కోయ శ్రీహర్ష, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ మున్సిపాలిటీకు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) గౌతమ్‌రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడకు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఖీమ్యానాయక్‌కు బాధ్యతలు అప్పగించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 28తో ముగియనున్నది. దీంతో నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పమేలా సత్పతికి బాధ్యతలు ఇచ్చారు.