కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు డ్రగ్స్, సర్జికల్స్ సరఫరా చేసే ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. మూడేళ్లుగా పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో రూ.4కోట్లకుపైగా బకాయి పడింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని దవాఖానలకంటే కరీంనగర్ దవాఖానకే తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలిసింది. ఈ కారణంగానే బిల్లుల చెల్లింపు ఇబ్బందిగా మారినట్టు తెలుస్తున్నది. దీంతో డ్రగ్స్, సర్జికల్స్ సరఫరా చేయలేమని ఇప్పటికే కొన్ని ఏజెన్సీలు చేతులేత్తేయగా, ఇది శస్త్ర చికిత్సల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఫలితంగా సేవలకు ఆటంకం కలిగి, నిరుపేద రోగులు ఇబ్బంది పడే ప్రమాదం ఏర్పడుతున్నది.
కరీంనగర్ విద్యానగర్, జూలై 15: కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో సర్జికల్, డ్రగ్స్ సరఫరా చేసే ఏజెన్సీలకు రాష్ట్ర సర్కారు మూడేళ్లుగా నామమాత్రంగా బిల్లులు చెల్లిస్తున్నది. నాలుగు ఏజెన్సీలు రోగులకు డ్రగ్స్, సర్జికల్స్ సరఫరా చేస్తుండగా.. వీరికి రూ.4 కోట్లకుపైగా రావాల్సి ఉన్నది. కానీ, ప్రభుత్వం ఈ జనరల్ హాస్పిటల్‌కు తక్కువ బడ్జెల్ కేటాయించడం, వస్తున్న కొద్దిపాటి బడ్జెట్‌తో ఏజెన్సీలకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది. దీనికి ప్రభుత్వ మెడికల్ కళాశాల సీట్ల రేష్యూతో ముడిపెడుతూ తగిన బడ్జెట్ కేటాయించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
మూడేళ్లుగా తగ్గుతూ వస్తున్న కేటాయింపులతో కోట్లలో ఉన్న బిల్లుల్లో వేటినీ చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. మెడికల్ కళాశాలల సీట్ల ఆధారంగా ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, జగిత్యాల, రామగుండం జనరల్ హాస్పిటళ్లకు కరీంనగర్ జనరల్ హాస్పిటల్ కంటే ఎక్కువ బిల్లులు రావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. నిజానికి అన్ని జిల్లాల కంటే ఈ దవాఖానలోనే మెరుగైన చికిత్సలు అందుతున్నాయి. దవాఖాన తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధికి వచ్చిన తర్వాత డ్రగ్స్, సర్జికల్స్ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించడం ఇబ్బందికరంగా మారింది.
చేతులెత్తేస్తున్న ఏజెన్సీలు
సర్జికల్, డ్రగ్స్ బిల్లులు పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. మూడేళ్లుగా సక్రమంగా చెల్లించకపోవడంతో ఏజెన్సీలు చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయి. ఒక్కో ఏజెన్సీకి కోట్లలో రావాల్సి ఉన్నదని, తమ సంస్థలను ఎలా నిర్వహించుకోవాలని సదరు ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. రూ. కోట్లలో బకాయిలు ఉంటే నెలకు, రెన్నెళ్లకోసారి రూ. లక్ష, రెండు లక్షలు చెల్లిస్తున్నారని, ఈ కారణంగా తాము ప్రభుత్వ జనరల్ దవాఖానలకు సర్జికల్స్, డ్రగ్స్ సరఫరా చేసే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జనరల్ హాస్పిటల్లో శస్త్రచికిత్సలు చేయాలంటే వైద్యులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ప్రభుత్వ పరంగా ఉచితంగా లభించే సర్జికల్స్, డ్రగ్స్ ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. అవసరమైన సర్జికల్స్ బయట కొనుక్కుంటేనే శస్త్ర చికిత్సలు చేసుకోవాల్సి వస్తున్నది.
నిరుపేద రోగులపై ప్రభావం
కరీంనగర్ జనరల్ హాస్పిటల్‌కు ఉమ్మడి జిల్లా నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వందల సంఖ్యలో ఓపీ చూపించుకుంటారు. వీరికి అవసరమైన డ్రగ్స్ ఇక్కడ ఉచితంగా లభిస్తాయనే నమ్మకంతో వస్తున్నా.. నిరాశే ఎదురవుతున్నది. ఒక్కో రోగికి వైద్యులు రాసే నాలుగైదు రకాల మందుల్లో ఒకట్రెండు బయటి మెడికల్ షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తున్నది. ఈ మందులు కొనుక్కోలేని పేదలు ఇచ్చినవి తీసుకొని ఇంటిదారి పడుతున్నారు. దీంతో రోగం మరింత ముదిరి ప్రాణాల మీదికి వస్తున్నది.
ఇక శస్త్ర చికిత్సల విషయానికి వస్తే.. పెండింగ్ బిల్లులు రూ.కోట్లలో ఉండడంతో రోగులకు అవసరమైన సర్జికల్ సరఫరా చేయడం లేదు. ఈ కారణంగానే శస్త్ర చికిత్సలు చేసేందుకు వైద్యులు కూడా వెనకాడుతున్నట్టు తెలుస్తున్నది. సర్జికల్స్ అందుబాటులో ఉండే వరంగల్ ఎంజీఎంకుగానీ, హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు గానీ, రెఫర్ చేయాల్సిన దుస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో దవాఖానలో లభించే విస్తృత సేవలకు ఆటంకం కలుగుతున్నది. దీని ప్రభావం నిరుపేద రోగులపై పడుతున్నది. జనరల్ దవాఖానగా మారిన తర్వాత హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశాలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదు. ఒక పక్క కరెంట్ బిల్లులు కూడా రూ.4 కోట్ల వరకు చేరుకున్నట్టు తెలిసింది.
ఇలాంటి పరిస్థితుల్లో హెచ్‌డీఎస్ సమావేశాలు నిర్వహిస్తే దవాఖానలో ఏం జరుగుతున్నదో ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దవాఖానకు వచ్చే ఇన్ పేషెంట్లు, ఔట్ పేషంట్లను దృష్టిలో పెట్టుకొని, అవసరమైన డ్రగ్స్, సర్జికల్స్ సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరమున్నది. లేదంటే రాబోయే రోజుల్లో ఏజెన్సీలు పూర్తిగానే సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడి, నిరుపేద రోగులు మరిన్ని ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.
బిల్లులు వస్తేనే మెరుగైన సేవలు!
దవాఖానలో గతంలో విస్తృతంగా నిర్వహించిన ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలకు సంబంధించి రూ.4 కోట్లకుపైగా బిల్లులు రావాల్సి ఉన్నది. కనీసం ఈ బిల్లులు విడుదల చేసినా దవాఖానలో కొంత సర్జికల్ బిల్లులు, వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇచ్చే అవకాశాలు ఉండేవి. ఆరోగ్య శ్రీ కింద ప్రైవేట్ దవాఖానలకు ఎంతో కొంత బిల్లులు చెల్లిస్తున్న స ర్కారు.. ప్రభుత్వ దవాఖాలకు మాత్రం మొండిచేయి చూపుతున్నది. ఇప్పటికైనా అటు బడ్జెట్ పెంచడంతోపాటు ఇటు ఆరోగ్యశ్రీ బిల్లులు విడుదల చేసినట్లయితే నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశముంటుంది.