కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 16: మారు పేర్లు, విజిలెన్స్ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మికులు చేపట్టిన ఆమరణ దీక్షలు ఆదివారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని, ఎన్నికల హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులు కొత్తగూడెం చేరుకున్నారు. ఇక్కడి హెడ్డాఫీసు ఎదుట ఈ నెల 12 నుంచి రిలే దీక్షలు మొదలుపెట్టారు.
అయితే, పంద్రాగస్టు వేడుకల కోసం సింగరేణి సీంఎడీ, డైరెక్టర్ (పా) ఇక్కడికి వస్తారని తెలుసుకున్న కార్మికులు ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే, రెండు రోజులపాటు ఇక్కడే పర్యటించిన సీఎండీ.. కార్మికుల దీక్షపై స్పందించకుండానే వెళ్లిపోయారు. దీంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులు ఆమరణ దీక్షను కొనసాగిస్తుండడంతో కొందరిలో రక్తపోటు పెరుగుతోంది. మరికొందరు బాగా నీరసించారు. దీంతో మిగతా కార్మికుల్లో ఆందోళన మొదలైంది.
అనేక ఏళ్లుగా సింగరేణిలో నెలకొన్న మారుపేర్ల సమస్యతోపాటు విజిలెన్స్ కేసులను పరిష్కరించేంత వరకు ఆమరణ దీక్షను విరమింబోమని బాధిత కార్మికులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు మూడు రోజులుగా సింగరేణి హెడ్డాఫీస్ వద్ద దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం సింగరేణిలో 450 పైచిలుకుగా మారు పేర్లు, విజిలెన్స్ కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని అనేక ఏళ్లుగా పోరాడుతున్నా పరిష్కారం లభించలేదు.
అయితే, తాము అధికారంలోకి వచ్చాక ఒకటీ రెండు నెలల్లోనే వీటిని పరిష్కరిస్తామంటూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరఫున రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ భూపాలపల్లిలో సీఎం రేవంత్రెడ్డి మాట ఇచ్చారు. అలాగే, ఈ సమస్యల పరిష్కారం కోసం కమిటీని కూడా ఏర్పాటుచేస్తామని ఆ మధ్య డిప్యూటీ సీఎం భట్టి కూడా హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకూ ముందడుగు వేయలేదు. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న బాధిత కార్మికులందరూ కొత్తగూడెం చేరుకొని ఈ నెల 12 నుంచి రిలే దీక్షలు చేపట్టారు.
స్వాతంత్య్ర వేడుకలకు సీఎండీ, డైరెక్టర్ (పా) కొత్తగూడెం వస్తున్న విషయం తెలుసుకొని 14న అకస్మాత్తుగా ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నప్పటికీ.. సీఎండీ, డైరెక్టర్ (పా) స్పందించలేదు. దీంతో దీక్షలో కూర్చున్న లక్క శ్రావణ్గౌడ్, ఆకుల సాయి, ఓం ప్రకాశ్, అన్వేశ్, అనీల్ అనే కార్మికులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు తెలిపారు. వీరితోపాటు రాజు, ఎస్కే బాబర్, అశోక్ అనే కార్మికులు కూడా నీరసించినప్పటికీ దీక్షను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీతోపాటు టీబీజీకేఎస్ నాయకులు, సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాలతోపాటు అన్ని సంఘాల నాయకులు సంఘీభావం తెలుపుతున్నారు.