ఒక సామాన్య గీత కార్మికుడు అసామాన్యమైన గీతాలకు కారకుడయ్యాడు. అక్షరాలతో పరిచయం లేనివాడు విలక్షణమైన పద్యాలు రాశాడు. కల్లు మండువాలో ఆయన రాసిన కీర్తనలు పాడుతూ కల్లు వంపుతుంటే అది విని అందరూ పరవశించిపోయేవారు. ఆయనే నిజాం రాష్ట్రంలో గడీల పాలనలో దొరల దౌర్జన్యాలను ఎదుర్కొని ప్రజాకవిగా మారిన విప్లవకారుడు, సంఘ సంస్కర్త, వాగ్గేయకారుడు, వర కవి కైరం భూమ గౌడ్.
జగిత్యాల జిల్లా రాయికల్ గ్రామంలో రాజమల్లు, లింగ మ్మ దంపతులకు క్రీ.శ.1876 ప్రాంతంలో భూమ గౌడ్ జన్మించారు. రాయికల్‌లో తన కులవృత్తి అయిన గీత కార్మికుడిగా పనిచేస్తూ, మండువాలోనే కాకుండా బోర్నపల్లి గంగకు వెళ్లే దారిలో చిన్న గుడిసె వేసుకొని కల్లు అమ్ముకొని జీవనం సాగించేవారు. ఆ కాలంలో తెలంగాణ ప్రాంతంలో సామాన్యుడు చదువుకోవడానికి వీల్లేదు. ఆ ఊరిలో బడి కూడా ఉండేది కాదు. అందువల్ల భూమ గౌడ్ చదువుకోలేకపోయారు. ఆ సమయంలో వైష్ణవ సంప్రదాయ స్వీకరణ కార్యక్రమాలు తరచుగా జరుగుతుండేవి. ఆ క్రమంలో ఆయన తన గురువైన సుప్రసిద్ధ కవి తిరునగరి నరసింహస్వామి సమక్షంలో శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించి భూమదాసుగా మారిపోయారు. అప్పుడే తన గురువు ప్రమేయంతో అక్షరాభ్యాసం చేశారు. కట్టె పలక మీద వస్త్ర గాలితం చేసిన ఇటుక పొడిని పరిచి, కట్టెపుల్లతో అక్షరాలు దిద్దడం నేర్చుకున్నారు.
తాటి చెట్లెక్కినపుడు కల్లు కుండలపై, ఇంట్లో గోడలపై పాల బలపంతో కవిత్వం రాసేవారు. రాయికల్‌లో రామునికి గుడి కట్టించి, ఆయనపై సీస పద్యాలతో శతకం రాశారు భూమ గౌడ్.చిన్నప్పటి నుంచే కవిత్వం పట్ల చక్కని అభిరుచి కలిగిన భూమ గౌడ్ రామాయణ, భారత, భాగవతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆయన పాటల్లో కృష్ణ చెలియలు, ఆధ్యాత్మలు, తిర్నామాలు, జానపదాలు, మంగళహారతులు, నిత్య తనయలు మొదలైనవి ప్రధానంగా ఉండేవి.
‘అడుగు దాటి కదల నివ్వనూ/నా కభయ మివ్వకున్న విడువనూ’, ‘గరుడ గమన నా మొర వినుమీ’, ‘కోలు కోలమ్మ కోలు శ్రీరంగనికీ కోలు’, ‘పగటి వేళది నేను పడుకున్న నీ చేత/నాలుక పై వ్రాసినావు వ్రాలు’, ‘మంచితనము మించి మరి చుట్టములు లేరు’ వంటి కీర్తనలు అత్యంత ప్రశస్తి పొందాయి. తన గురువైన నరసింహదాసు రచించిన ‘మాధవ చరితం’ అనే యక్షగానాన్ని చాలాసార్లు ప్రదర్శించారు.
భూమ గౌడ్ కంఠస్వరం గంభీరమైన ఆర్ద్రతతో, విలక్షణమైన జీరతో, మనస్సుకు హాయి చేకూర్చేలా ఆత్మీయంగా ఉండేది. గంగిరెద్దులవాళ్లు, హరిదాసులు, భిక్షాటకులు ఆయన రాసిన కీర్తనలు విని, నేర్చుకుని ఇల్లిల్లూ తిరిగి పాడుకుని భిక్ష స్వీకరించేవారు. అలా ఆయన పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. చరక సంహిత, సుశ్రుత సంహిత లాంటి పుస్తకాలు చదివి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వైద్యం అందించి గొప్ప వైద్యునిగా కూడా పేరుపొందారు భూమ గౌడ్.
‘బర్రె నలుపు వున్న పాలు తెల్లగనుండు టీకు టాకొక్కటే ఠీవి గాదు పత్తికాయను చూడ వన్నెలీనక యుండు పగిలి తెల్లని పైడి ప్రత్తి వెడలు నల్లరేగడి దున్న తెల్లజొన్నలు పండు దుబ్బ చేను సొబగు దొరకు నేమి ఇంపు సొంపులు ఎన్నున్ననేమాయె ఆత్మ శృంగారమ్ము అసలు లేక చెరిగిపోయిన బట్టల చెలిగినంత గుడికి భక్తుని స్వామి చేగొనగ లేడె గజమునకు మోక్షమిచ్చిన ఖగ పతీంద్ర రాజ రాజేంద్ర రావికల్ రామచంద్ర’
అంటూ తేటతేట మాటల్లో ఎన్నో జీవిత సత్యాలను దర్శింపజేశారు భూమ గౌడ్. జీర్ణావస్థలో ఉన్న భూమ గౌడ్ రాతప్రతులను సేకరించి, పరిష్కరించి ‘వర కవి కైరం భూమదాసు కృతులు’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించారు ప్రముఖ కవి వేముల పెరుమాళ్ళు. భూమ గౌడ్ జీవిత చరిత్రను ‘వర కవి భూమ గౌడ్’ పేరుతో ఒక నవల రాసి 2017లో ప్రచురించారు ప్రముఖ కవి, రచయిత వేముల ప్రభాకర్. భూమ గౌడ్‌తోపాటు ఆయన గురువు తిరునగరి నరసింహస్వామి విగ్రహాన్ని రాయికల్‌లో ప్రతిష్ఠించే పనిలో నిమగ్నమై ఉన్నారు వేముల ప్రభాకర్.
‘గుడి యడవి నుయ్యి తెర్లగు
వడి నీళ్లను చెరువు తెగును వ్యర్థమగు ధనమ్
ఘడియలొ ప్రాణాలు వెడలు
చెడనిది కవనంబు నీదు చెలిమియు రామా’
భగవంతునిపై భక్తి లేని ధనవంతులైన దురహంకారులు నిరుపేదయైన భూమ గౌడ్‌ను, ఆయన కవిత్వాన్ని హేళన చేసిన సందర్భంలో ఆశువుగా ఆయన చెప్పిన చాటుపద్యమిది. ‘నేను ధనికుడనైతె నన్నెవ్వడడుగు/అక్షరమ్ముంటెనే గదా యాదికొస్తా’ అని ఎలుగెత్తి చాటి, తన పాటలను దుర్మార్గులైన పాలకులపై దివ్యాస్ర్తాలుగా ఎక్కుపెట్టి, నిరుపేదలను ఆదుకుంటూ, సంఘ సంస్కర్తగా సమాజంలోని కుళ్లును కడిగేస్తూ, పన్నెండేండ్లు దేశాటనం చేసి ఎందరికో జ్ఞానభిక్ష పెట్టారు. అద్భుతమైన సాహిత్యాన్ని మనకు అందించిన వర కవి భూమ గౌడ్ 1950లో పరమపదించారు.