వేములవాడ, డిసెంబర్ 18 : స్వరాష్ట్రంలో మహిళల రక్షణకు రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గృహహింస, ఆకతాయిల చిల్లరచేష్టలు, పనిచేసే చోట వేధింపుల నుంచి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రం వచ్చిన కొద్దిరోజులకే షీటీంలు ఏర్పాటు చేసి అండగా నిలిచింది. విద్యాసంస్థలు, కార్యాలయాలు, మహిళలకు సంబంధించిన పలు సమావేశాల్లో షీటీంల గురించి అవగాహన కల్పించి చైతన్యం తెచ్చింది. ఇంకా అత్యవసర సమయాల్లో సాయానికి డయల్ 100, షీటీంల నంబర్లతో భరోసా కల్పించింది. కాగా, కొత్తగా పోలీసు స్టేషన్లకు వచ్చే మహిళలకు తక్షణ సాయం కోసం హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసింది. చట్టపరమైన అవసరాలు, న్యాయపరమైన సాయం, ఇంకా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చేవారికి ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో సాయం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడాదికి సగటున 2వేల కేసులు నమోదవుతుండగా, ఇందులో దాదాపు 500 వరకు మహిళలకు సంబంధించిన కేసులే ఉంటున్నాయి. చట్టపరమైన, న్యాయపరంగా సమస్యను ఎదుర్కొనేందుకు మహిళలు పోలీసు కార్యాలయాలను ఆశ్రయిస్తున్న తరుణంలో రాష్ట్ర పోలీసుశాఖ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఫోక్సో, నిర్భయ, వరకట్న వేధింపులు, తమకు జరిగిన అన్యాయాలను నేరుగా చెప్పుకునేందుకు వీలుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే మహిళల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు. ఇంకా ఇందులో మహిళా పోలీసు అధికారులతో సేవలు అందిస్తున్నారు.
ఉద్యోగం, విద్య తదితర అవసరాల నిమిత్తం బయటకు వెళ్లే బాలికలు, మహిళలకు ఆకతాయిల వేధింపుల నుంచి రక్షణ కోసం షీటీంలను ఏర్పాటు చేసి నిఘాను కట్టుదిట్టం చేశారు. ఎప్పటికప్పుడు విద్యాసంస్థలు, కార్యాలయాలు, మహిళలకు సంబంధించిన పలు సమావేశాల్లో షీటీం సభ్యులు అవగాహన కల్పిస్తూ చైతన్యం చేస్తున్నారు. అన్‌టచ్‌బుల్, లైంగిక వేధింపులు లాంటివి ఎదుర్కొనే సమయంలో బాధితుల వివరాలు బయటకు రాకుండా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్లను కేటాయించారు. ఇందులో 100డయల్, జిల్లా షీటీమ్ సెల్‌నెంబర్ 8712656425, షీటీమ్ ఎస్ఐ సెల్‌నెంబర్ 8712656424కు ఫిర్యాదుచేస్తే చాలు వివరాలు గోప్యంగా ఉంచి సదరు అనుమానితులు, అకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఈ విషయమై ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించి మహిళల్లో ధైర్యాన్ని పెంపొందిస్తున్నారు.
చట్టపరమైన సేవల కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చే మహిళలకు ప్రత్యేక వింగ్ ఏర్పాటుచేశాం. సమస్యలు ఏదైనా ఉంటే వారు నిర్భయంగా సంబంధిత మహిళ పోలీసు అధికారికి చెప్పి ఫిర్యాదు చేయవచ్చు. ఇతరత్రా ఇబ్బందులు ఉంటే కూడా షీటీం సంబంధించిన సెల్‌ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదుచేస్తే వివరాలు గోప్యంగా ఉంచి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. మేం ఒక్కటే చెబుతున్నాం. మహిళల రక్షణకు మేం ఉన్నాం. మా సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– నాగేంద్రచారి, డీఎస్పీ,వేములవాడ