మల్యాల, జూన్ 25 : కొండగట్టు అంజన్న ఆలయంలో మరో ఇద్దరు ఆలయ పర్యవేక్షకులపై చర్యలకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా సెక్యూరిటీ గార్డులను నియమించి, నేరుగా జీతాలు చెల్లించిన వ్యవహారం నేరుగా అప్పటి కలెక్టర్ వద్దకు వెళ్లింది. నివేదిక ఆధారంగా ఇరువై రోజుల క్రితమే కమిషనర్ చర్యలకు ఆదేశాలు జారీ చేయగా, ఈ విషయం ఆలయవర్గాల్లో కలకలం రేపుతున్నది.
నిబంధనల ప్రకారం ఆలయాల్లో ఉన్నతాధికారుల అనుమతితో గానీ, సొసైటీ లేదా ఏజెన్సీల నుంచి గానీ సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి. కానీ, కొండగట్టు అంజన్న ఆలయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. పాత ఏజెన్సీ ద్వారా నియమించిన 11 మంది సెక్యూరిటీ గార్డుల ఒప్పందం పూర్తయినా కొనసాగించారు. పైగా వీరికి 2023 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్ వరకు ప్రతి నెలా జీతాలను నేరుగా చెల్లించారు.
ఈ వ్యవహారంపై నాటి కలెక్టర్ యాస్మిన్ బాషాకు ఫిర్యాదు వెళ్లగా.. గత ఫిబ్రవరి ఒకటిన ఈవో వెంకటేశంతోపాటు ఇద్దరు పర్యవేక్షకులు సునీల్‌కుమార్, శ్రీనివాసశర్మకు అప్పటి మెమోలను జారీ చేశారు. తర్వాత వారు ఐదో తేదీన లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చినా సంతృప్తి చెందక చర్యలకు ఉపక్రమించారు. సదరు ఈవోతోపాటు ఇద్దరు పర్యవేక్షకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఏప్రిల్ ఒకటిన దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుకు నివేదించారు.
నివేదికను పరిశీలించిన ఆయన, ఆలయ పర్యవేక్షకులు సునీల్‌కుమార్, శ్రీనివాసశర్మపై సెక్షన్ 37 ఎండోమెంట్ చట్టం 30/87, జీవోఎంఎస్ నంబర్ 830 ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈవో ఆవునూరి చంద్రశేఖర్‌కు ఈ నెల నాలుగో తేదీనే ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆలయ ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. ఇప్పటికే అంజన్న సొమ్మును పక్కదారి పట్టించిన బాగోతంలో పలువురిపై వేటు పడగా.. తాజాగా సెక్యూరిటీ గార్డుల వ్యవహారం గుబులు పుట్టిస్తున్నది.