KCR CUP | ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 9 : క్రికెట్ టోర్నమెంటులో పాల్గొనే యువకులు క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని బీఆర్ఎస్ రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే టోర్నమెంటులో 12 మండలాలు, 2 మున్సిపాలిటీలు, మండల స్థాయిలో గెలిచిన జట్టుకు రూ.50వేలు క్యాష్ ప్రైజు, రన్నర్ జట్టుకు రూ.20వేల ప్రైజ్ మనీ ఉంటుందన్నారు.
ప్రతీ మండలం నుంచి రెండు జట్లు, మొత్తంగా జిల్లా స్థాయిలో 32 జట్లు పోటీ పడనున్నట్లు తెలిపారు. ఈ నెల పదో తేదీ నుంచి 17వరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో లీగ్ మ్యాచులు నిర్వహిస్తారని, 18 నుంచి 25 తేదీ వరకు జిల్లా కేంద్రంలో పోటీలు ఉంటాయని చెప్పారు. పోటీల్లో గెలుపోటములు సహజమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, సర్పంచ్ ఎన్గందుల నర్సింలు, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.