ధర్మపురి, మే 11 : కరీంనగర్ పీఎంజే నగల దుకాణంలో జరిగిన దోపిడీ కేసు ఉత్కంఠ రేపుతున్నది. బుగ్గారం మండలం మద్దునూర్ వద్ద లభ్యమైన ఓ మొబైల్ ఫోన్ పోలీసులు దర్యాప్తులో కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తున్నది. గ్రామ శివారులోని లోలెవల్ వంతెన వద్ద ఈనెల 3న ఓ బైక్ సడెన్‌గా ఆగిపోవడం, దానిపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల్లోంచి ఒకరు ఫోన్‌ను బండకేసి బలంగా కొట్టి దూరాన విసిరేసినట్టు అక్కడే ఆడుకుంటున్న అదే గ్రామానికి చెందిన పదమూడేళ్ల ఇద్దరు బాలురు చూశారు. వారు వెళ్లిన తర్వాత ఆ ఫోన్ తెచ్చుకున్నారు. తర్వా త పీఎంజే దొంగలు మద్దునూర్ మార్గం ద్వా రానే వెళ్లారనే వార్తలు చూసి భయాందోళనలకు గురై ఫోన్ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఈ మేరకు ఈ నెల 7న బుగ్గారం ఎస్ఐ సతీశ్‌కు ఫోన్ అప్పగించినట్టుగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఆ ఫోన్లో ఏం ఉండొచ్చు?
పోలీసుల టెక్నికల్ ట్రాకింగ్ నుంచి తప్పించుకునేందుకు దుండగులే ఫోన్‌ను బద్దలు కొట్టి పడేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాల్‌డేటా, లొకేషన్, వాట్సాప్ చాట్స్, గుగూల్ మ్యాప్స్ హిస్టరీ, ఫొటోలు, ఆన్లైన్ లావాదేవీలు.. ఇవన్నీ నేరస్తుల కదలికలను నిమిషాల్లో బయటపెట్టే అవకాశం ఉండడంతో ఫోన్ ధ్వంసం చేసినట్టు చెబుతున్నారు. అయితే ఫోన్ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ కూడా టెక్నికల్ టీమ్‌లు డేటా రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దుండగుల కనెక్షన్లతోపాటు ఇతర గ్యాంగ్ సభ్యుల కాంటాక్ట్‌లు పోలీసులకు దొరికి ఉండవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు సూత్రధారులను వివిధ రాష్ర్టాల్లో అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం కాగా, త్వరలోనే కరీంనగర్ సీపీ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశమున్నటు తెలిసింది.
ధర్మపురిలోనే నగల పంపకం?
దోపిడీ అనంతరం గ్యాంగ్ సభ్యులందరూ ఒకే చోట ఎక్కువ సేపు ఉండడం ప్రమాదకరమని భావించి, ముందుగానే సిద్ధం చేసుకున్న ప్లాన్ ప్రకారం ధర్మపురిలో నగలు పంచుకొని, ఎటువారు అటు విడిపోయి పరారై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఐదురుగురిలో ముగ్గురు ప్రయాణించే పల్సర్ బైక్ ధర్మపురి మహాలక్ష్మి ఘాట్ సమీపంలో వదిలేయడం, అపాచీ బైక్ అదిలాబాద్ వైపు వెళ్లినట్టు గుర్తించడం, మద్దునూర్ వద్ద మొబైల్ ఫోన్ లభించడం.. ఇవన్నీ గ్యాంగ్ విడిపోయి వేర్వేరు మార్గాల్లో కదిలినట్లు సూచిస్తున్నాయని అనుమానిస్తున్నారు.