Rajya Lakshmi Colony | కోల్ సిటీ, ఆగస్టు 21: మూడు రోజుల కిందట కురిసిన వర్షాలకు అడుగడుగునా గుంత పడింది. అటుగా వెళ్తున్న వారికి.. ఎక్కడ పట్టు జారి పడితే… ఏలాంటి ప్రమాదం జరుగుతుందోనని గుండె అదురుతోంది. రామగుండం నగర పాలక సంస్థ 35వ డివిజన్ పరిధిలోని మెడికల్ కళాశాల ప్రక్కనే గల రాజ్యలక్ష్మీ కాలనీకి వెళ్లాలంటే వాహనం దిగి కాలి నడకన వెళ్లాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది.
ఇటీవల కురిసిన వర్షాలకు ఆ కాలనీ రోడ్లు అడుగడుగునా గుంతలు ఏర్పడి బురదమయంగా మారింది. ఈ రోడ్డు ఇళ్ల మధ్య నుంచే ఉండటంతో వాహన చోదకులు, స్థానికులు తీవ్ర అవస్థలతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. బురద గుంతలతో ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే కనీస మౌలిక వసతులకు నోచుకోలేక రాజ్యలక్ష్మీ కాలనీ ప్రజలు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
కాలనీలో రోడ్లు, విద్యుత్ అస్తవ్యస్థంగా ఉందని నగర పాలక కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. రోడ్లు మాత్రం నరకానికి రహదారిగా ఉండటంతో ద్విచక్ర వాహనాలపై పిల్లా, పాపలతో రాకపోకలు సాగించేవారు దేవుడా.. దేవుడా అని తలచుకుంటూ రోడ్డు దాటేంత వరకు ప్రాణభయంతో వెళ్తున్నామని చెబుతున్నారు.