Right to Information Act | కలెక్టరేట్, అక్టోబర్ 8 : సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల అదనపు రెవెన్యూ కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 20 ఏండ్లు అయిన సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం ఆయా శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడారు.
సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల సమాచారం, ఉద్యోగుల విధులు, బాధ్యతలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. దేశ భద్రత, రహస్య ఇతర ఇబ్బందులు ఎదురయ్యే సమాచారం మినహా అన్ని ఇవ్వాలని సూచించారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో పౌర సమాచార అధికారి, సహాయ పౌర సమాచార అధికారి వివరాలు ఉండాలని తెలిపారు.
ఎవరైనా సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో వారికి సమాధానం ఇవ్వాలని సూచించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి సమాచారం ఉచితంగా ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అంతా ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.