సాధారణంగా ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్న అనంతరం వాటిని సంబంధిత తహసీల్ ఆఫీస్‌కు అప్పగిస్తారు. అక్కడ రెవెన్యూ అధికారులు జరిమానా విధించి, ఇసుక డంప్ చేసుకుంటారు. ఆ ఇసుకకు వేలం వేసి, వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమచేస్తారు. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. కానీ, జమ్మికుంటలో దీనిని పూర్తిగా మార్చి వేశారు. ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయగానే సదరు యజమానులు కోర్టును ఆశ్రయించి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకోవడంతో పోలీసులు విడుదల చేస్తున్నారు. కానీ, అదే ఆర్డర్లో ఉన్న కోర్టు ఆదేశాలను మాత్రం విస్మరిస్తున్నారు.
సీజ్ చేసిన ట్రాక్టర్‌లోని ఇసుకను తహసీల్దార్ స్వాధీనం చేసుకొని వేలం వేసి, వచ్చిన ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి జమచేసి, సదరు చలానాను కోర్టుకు సమర్పించాలని స్పష్టంగా రిలీజ్ ఆర్డర్లో ఉన్నా.. దానిని పట్టించుకునే వారు కరువయ్యారు. నిశితంగా పరిశీలిస్తే.. సీజ్ చేసిన ట్రాక్టర్లు తహసీల్దార్ కార్యాలయానికే రాకపోగా, అందులోని ఇసుకంతా మధ్యలోనే మాయమవుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే జమ్మికుంట కేంద్రంగా ఇసుక మాయజాలం జరుగుతున్నది. అయితే ఈ బాగోతంలో సూత్రదారులెవరు? పాత్రదారులెవరు? ప్రభుత్వానికి జరుగుతున్న నష్టమెంత? కోర్టు ఆదేశాలను పాటించకుండా ఈ తతంగం నడుపుతున్నది పోలీసులా..? రెవెన్యూ అధికారులా..? దీని వెనుక జరుగుతున్న బాగోతం ఏంటి? అన్నది తేలాలంటే.. లోతుగా విచారణ చేయాలన్న డిమాండ్ వస్తున్నది.
కరీంనగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / జమ్మికుంట : జమ్మికుంట కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా చాలాకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మండలంలోని విలాసాగర్, తనుగుల, గండ్రపల్లి గ్రామాల సమీపంలో మానేరు నదీ పరీవాహకం నుంచి తరలుతుండడం విదితమే. అక్రమార్కులు మానేరు నుంచి అక్రమంగా తరలించడం, ఆయా గ్రామాల ప్రజలు అడ్డుకోవడం, పోలీసులు సీజ్ చేయడం, ఆ తర్వాత దందా మళ్లీ యథావిధిగా కొనసాగడం అంతా ఎప్పుడూ జరుగుతున్నదే. ఈ దందా లాభదాయకంగా ఉండడంతో చాలా మంది ఒకరిని చూసి, మరొకరు ట్రాక్టర్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. పలు గ్రామాల నుంచి వందలాది ట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంటాయని సమాచారం కాగా, పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, తదితర శాఖల అధికారులు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అప్పడప్పుడు పట్టుకోవడం, మళ్లీ విడిచిపెట్టడం ఇక్కడ అత్యంత సాధారణంగా జరుగుతున్నదనే విమర్శలున్నాయి. అందుకే అక్రమార్కులు తమ దందాను విడిచిపెట్టడం లేదు. దీనిని నిరంతరం కొనసాగించేందుకు ఇష్టపడుతున్నారని చెప్పడానికి ఆయా గ్రామాల్లో తరుచుగా జరిగే సంఘటనలే నిదర్శనం.
సరికొత్త దందాకు శ్రీకారం
ఇసుక అక్రమ దందాను అరికట్టేందుకు కొన్ని నెలల క్రితం పోలీసులు ఉక్కుపాదం మోపింది వాస్తవమే. ఒక దశలో వందలాది ట్రాక్టర్టను సీజ్ చేయడమే కాదు, అక్రమ రవాణా చేయాలంటేనే భయపడే పరిస్థితిని కల్పించింది నిజమే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ, అక్రమ రవాణా మాత్రం మళ్లీ యథేచ్ఛగా సాగుతున్నది. ఇటీవలి కాలంలో పోలీసులు దాదాపు 90 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. అయితే సాధారణంగా పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి, ఆ తర్వాత సంబంధిత తహసీల్ కార్యాలయానికి అప్పగిస్తారు. వారు జరిమానా వేసి, ఇసుకను స్వాధీనం చేసుకుంటారు. అలా డంప్‌చేసిన ఇసుకను వేలం వేస్తారు.
అందుకోసం పేపర్ ద్వారా ప్రకటన జారీ చేస్తారు. ఇసుకను అమ్మగా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. ఇదంతా ఒక ప్రొసిజర్. కానీ, జమ్మికుంటలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. సీజ్ చేసిన ఇసుక ట్రాక్టర్లను ఠాణా సమీపంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో పెడుతున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పోలీసులు కోర్టుకు పంపడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ మేరకు కోర్టుకు వెళ్లిన సదరు ట్రాక్టర్ యజమానులు, కోర్టు నిబంధనల ప్రకారం పూచీకత్తు ఇచ్చి రిలీజ్ ఆర్డర్‌ను తెచ్చుకుంటున్నారు. దీంతో పోలీసులు సదరు ట్రాక్టర్లను విడిచిపెడుతున్నారు. ఇక్కడి వరకు నిబంధనలను పాటిస్తున్నా, ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలవుతున్నది. కోర్టు రిలీజ్ ఆర్డర్‌లోనే మరో స్పష్టమైన ఆదేశాన్ని ఇస్తున్నది. రిలీజ్ ట్రాక్టర్‌కు సంబంధించిన ఇసుకను వేలం వేసి, విక్రయించిన మొత్తాన్ని చలానా ద్వారా ప్రభుత్వానికి జమచేయాలని, సదరు చలాన్ కాపీని కోర్టుకు సమర్పించాలని అదే ఆర్డర్లో తహసీల్దార్‌ను స్పష్టంగా ఆదేశిస్తున్నది.
కోర్టు ఆదేశాల ఉల్లంఘన?
రిలీజ్ ఆర్డర్‌లోనే కోర్టు తహసీల్దార్‌కు స్పష్టంగా ఆదేశాలిస్తున్నా.. ఆచరణలో అమలు కావడం లేదు. తాజాగా అందుతున్న సమచారాన్ని బట్టి చూస్తే.. సీజ్ చేసిన దాదాపు 90 ట్రాక్టర్లకు సంబంధించి రిలీజ్ ఆర్డర్లు కోర్టు నుంచి వచ్చినట్టు తెలుస్తున్నది. ఆ మేరకు సదరు ట్రాక్టర్లను పోలీసులు వదలి పెట్టారు. కానీ, అందులోని ఏ ఒక్క ట్రాక్టర్ తహసీల్ ఆఫీస్‌కు వెళ్లలేదు. ఇసుక అన్లోడ్ చేయలేదు. అధికారికంగా వేలం వేయలేదు. కానీ, ఐదు వేల చలానాను సీజ్ చేసిన ట్రాక్టర్దారులు తీసుకొచ్చి, రెవెన్యూ కార్యాలయంలో అప్పగించి దర్జాగా వెళ్తున్నారు. అసలు ఆ 5వేలు ఎవరూ నిర్ధారిస్తున్నారు? అంతే మొత్తంలో ప్రతి ట్రాక్టర్ చలానా ఎందుకు కడుతున్నారు? కోర్టు రీలీజ్ ఆర్డర్లో చెప్పినట్టు సీజ్ అయిన ట్రాక్టర్లు తహసీల్దార్ వద్దకు ఎందుకు రావడం లేదు? రాకుండానే చలానా ఎలా కడుతున్నారు? దీని వెనుక సూత్రదారులెవరు? పాత్రదారులెవరు? అన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిశితంగా పరిశీలిస్తే ముమ్మాటికి ఇది కోర్టు నిబంధనల ఉల్లంఘనే అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రశ్నలకు జవాబులెక్కడ?
నిబంధనల ప్రకారం సీజ్ చేసిన ఇసుక అక్రమ ట్రాక్టర్లను తహసీల్ ఆఫీస్‌కు పోలీసులు అప్పగించాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితులు కావచ్చు? లేదా మారిన చట్టాల కారణంగా కావొచ్చు? రెవెన్యూ కార్యాలయానికి పంపకుండా కోర్టుకు పంపే అధికారం పోలీసులకు ఉండొచ్చు. కానీ, కోర్టు ఆదేశాల ప్రకారం ట్రాక్టర్లను రిలీజ్ చేస్తున్న పోలీసులు, అందులోని ఇసుకను డంప్ చేయడానికి తహసీల్దార్‌కు ఎందుకు అప్పగించడం లేదు? అధికారికంగా వేలం వేయకుండానే వేసినట్టు చూపి ఎలా 5వేల చలానా కడుతున్నారు? అసలు అలా కట్టాలని ఎవరు చెబుతున్నారు? ఆ చలానాను తిరిగి కోర్టులో ఎలా సమర్పిస్తున్నారు?
ఆ సమయంలో వేలం ద్వారా వచ్చినట్టు చూపుతున్నారా..? లేక ఇంకా ఏమైనా కారణాలు చెబుతున్నారా..? సదరు చలానాను తహసీల్దార్ ఎలా అంగీకరిస్తున్నారు? ఇసుక వేలం వేసి, ప్రభుత్వ ఖాతాలో జమచేసి, సదరు చలానాను కోర్టులో సమర్పించాలని ఆదేశాలుంటే.. ఉల్లంఘన ఎలా జరుగుతున్నది? లోతుగా పరిశీలిస్తే దీని వెనుక పెద్ద తతంగమే జరుగుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆదాయం ఎక్కువ తక్కువతో సంబంధం లేకుండా.. వేలం వేయకుండా జరుగుతున్న ఈ బాగోతంపై విచారణ చేస్తే, తప్పుడు పద్ధతులకు పాల్పడుతున్నదెవరు? కోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తున్నదెవరు? అనేది బహిర్గతం అవుతున్నది. అంతేకాదు, మరోసారి తప్పు జరుగకుండా ఉంటుంది. ప్రధానంగా పట్టుబడిన ఇసుక తహసీల్ ఆఫీస్ చేరుకుండానే మధ్యలోనే మాయం అవుతున్న తీరులోని లొసుగులు బయటకు వచ్చే అవకాశాముంటుంది. అలాగే అక్రమార్కులు చేస్తున్న దందాకు అడ్డకట్ట పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చలానా తీసుకుంటున్నం అంతే
నిబంధనల ప్రకారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు, ఇతర వాహనాలను పట్టుకొని పోలీసులు మాకు అప్పగించాలి. సదరు ట్రాక్టర్ యజమాని మొదటి సారి దందా చేస్తున్నారా..? లేక రెండోసారి దందా చేస్తున్నారా..? ఎన్నిసార్లు పట్టుబడ్డారు? అని చూసి జరిమానా విధిస్తాం. సదరు ఇసుకను వేలం వేయాలి. ప్రస్తుతం జమ్మికుంటలో అలా చేయడం లేదు. కోర్టుకు రాస్తున్నారు. కోర్టు మాకు ఆర్డర్ కాపీ పంపిస్తున్నది. వచ్చినోళ్లు 5వేల చలానా తెస్తున్నారు. రిలీజ్ ఆర్డర్ పట్టుకుపోతున్నారు. అంతా పేపర్ మీదే జరుగుతున్నది. ట్రాక్టర్ ఇక్కడికి రాదు. ఇసుక డంప్ ఉండదు. వేలం వేసేది లేదు. చలానైతే వస్తుంది అంతే.
– రమేశ్‌బాబు, జమ్మికుంట తహసీల్దార్