BRS | సారంగాపూర్, జూలై 24: స్థానిక సమరంలో ప్రతీ గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడాలని మాజీ జడ్పీ చైర్మెన్ దావ వసంత సురేష్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి గురువారం బీర్ పూర్ మండల కేంద్రంలో మండలంలోని ఆరు ఎంపీటీసీల పరిధిలో నాయకులు, కార్యకర్తలతో జడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత-సురేష్ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై దేశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ సమన్వయంతో కష్టపడి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చిందని, వాటి అమలులో విఫలమైందని మండిపడ్డారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
మండలంలోని ఆరు ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆన్నారు. మండలంలో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ కోల్ముల రమణ, మాజీ సింగిల్ విండో చైర్మన్ మెరుగు రాజేశం, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నేరెల్ల సుమన్ గౌడ్, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు రంగు మల్లేశం, రవీందర్, నాయకులు రాంచంద్రం, రాజేశం, రామన్న, జితేందర్, శ్రీనివాస్, సుధాకర్, లింగన్న, రాజేష్, రామయ్య, శంకర్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.