కాల్వశ్రీరాంపూర్, జూలై 27: వానకాలం వస్తే మల్యాల, పోచంపల్లి గ్రామాల ప్రజానీకం జంకుతున్నది. చిన్నపాటి వానకే రెండు గ్రామాల మధ్యలోని నక్కల ఒర్రె పొంగుతూ రోజుల తరబడి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. మల్యాల రైతుల పొలాలు పోచంపల్లి శివారులో ఉండడంతో నాట్లు, ఇతరత్రా పనుల కోసం తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దాటాల్సిన పరిస్థితి ఉన్నది.
ఒర్రె దాటుతూ గతంలో పలువురు ప్రమాదాల బారిన పడ్డ సందర్భాలు ఉండగా, తాజాగా శనివారం పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటకు చెందిన 15 మంది కూలీలు చిక్కుకోవడం, గ్రామస్తులు తాళ్లసాయంతో రక్షించడం పరిస్థితికి అద్దంపడుతున్నది. గత ఎన్నికల సమయంలో మల్యాలలో ప్రచారం సందర్భంగా ఒర్రెపై బ్రిడ్జి నిర్మిస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే విజయరమణారావు హామీ ఇచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా నెరవేర్చలేని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణ హామీ ఎటువాయె..? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే సారు బ్రిడ్జి నిర్మించాలె
మాది మల్యాల. మా పొలాలన్నీ పోచంపల్లి వైపే ఉన్నయి. వానకాలం వచ్చిందంటే ఒర్రె దాటేందుకు నరకం సూడాలె. నక్కల ఒర్రె ఉప్పొంగి రాకపోకలు బంద్ అయితయ్. గతంలో ప్రమాదాలు కూడా జరిగినయి. ఎమ్మెల్యే సారు బ్రిడ్జి చేయిస్తనని మాట ఇచ్చిండు. ఏడాదిన్నర అయినా నిర్మించలె. సారు స్పందించి బ్రిడ్జి నిర్మించి రైతులను ఆదుకోవాలె.
– వేల్పుల సంపత్, రైతు (మల్యాల)
వానకాలం వస్తే ప్రమాదాలే
వానకాలం వచ్చిందటే చాలు ఏదో ఒక ప్రమాదం జరుగుతంది. గతంలో మామిడి కొంరయ్య ఎడ్ల బండి ఒర్రెలో మునిగిపోయి, రెండ్లు ఎడ్లు కొట్టుకు పోయినయి. రెండ్రోజుల కింద 15 మంది కూలీలు చిక్కుకున్నరు. క్షణం లేటయితే పెద్ద ప్రమాదం జరిగేది. గ్రామస్తులమంతా వారిని తాడు సాయంతో కాపాడినం.
-పడాల కుమారస్వామి, రైతు (మల్యాల)