వేములవాడ, నవంబర్ 14 : దేవాదాయశాఖలో బది‘లీలలు’ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. ట్రాన్స్ఫర్లు పకడ్బందీగా చేపట్టామని రాష్ట్రస్థాయి అధికారులు చెబుతున్నా, అంతా ఇష్టారాజ్యంగా నడుస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, కొండగట్టు, కొమురవెల్లి, బాసరను యూనిట్‌గా చేసి గత ఆగస్టులో దేవాలయ ఉద్యోగులను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే దేవాదాయశాఖ అధికారులకు మాత్రం రాష్ట్రంలోని అన్ని ఆలయాలకంటే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపైనే భక్తి ఎకువగా ఉన్నట్టు కనిపిస్తున్నది. బదిలీల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయానికి యాదగిరిగుట్ట నుంచి బదిలీపై వచ్చిన ఉద్యోగులను ఒకొకరిగా మళ్లీ అక్కడికే డిప్యూటేషన్‌పై పంపించడమే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
ఆగస్టులో వేములవాడలో పర్యవేక్షకుడిగా పనిచేసే రాజన్ బాబును యాదగిరిగుట్టకు, యాదగిరిగుట్టలో పర్యవేక్షకుడిగా విధులు నిర్వర్తిస్తున్న గోలి శ్రీనివాస్‌ను వేములవాడ ఎమ్మెల్యే పీఏగా నియమిస్తూ అప్పటి కమిషనర్ హన్మంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సెప్టెంబర్ 23న వేములవాడలో పర్యవేక్షకురాలు శ్రీలతను యాదగిరిగుట్టకు డిప్యుటేషన్‌పై పంపించారు. తాజాగా రాజన్న ఆలయ ఏఈవో రమేశ్‌బాబును యాదగిరిగుట్టకు డిప్యూటేషన్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రెండ్రోజుల క్రితమే రాజన్న ఆలయ కార్యాలయానికి చేరుకున్నాయి. అయితే దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న హన్మంతరావు కొద్దిరోజుల క్రితమే కలెక్టర్‌గా బదిలీఅయ్యారు. ఆయన స్థానంలో మరో అధికారి హన్మంతును కమిషనర్‌గా నియమించినప్పటికీ, వయసు లేదనే కారణంతో అతడికి బాధ్యతలు అప్పగించలేదు. ఈ క్రమంలో మరో ఐఏఎస్ అధికారి శ్రీధర్‌ను ప్రభుత్వం నియమించగా, ఆయన బాధ్యతలు చేపట్టక ముందే ఏఈవో రమేశ్‌బాబు డిప్యూటేషన్ ఉత్తర్వులు వెలువడడం దేవాదాయశాఖ ఉద్యోగవర్గాల్లో చర్చనీంయాశమైంది. ఇది ఎలా సాధ్యమైందనేది? అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బదిలీలు పకడ్బందీగా చేశామని చెబుతున్న ఆ శాఖ ఉన్నతాధికారులే డిప్యూటేషన్ల పర్వం కొనసాగిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది.
యాదగిరిగుట్ట మాతృ సంస్థగా ఉన్న పర్యవేక్షకుడు అశోక్ వేములవాడకు బదిలీ అయ్యాడు. అయితే యాదగిరిగుట్టలో సహాయ కార్యనిర్వాహణ అధికారి పోస్టు ఖాళీ కాగా, సీనియారిటీ ప్రకారం అశోక్‌కు 43 రోజుల కిందే పదోన్నతి వచ్చింది. ప్రస్తుతం వేములవాడ పీఆర్వో కార్యాలయంలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఆయనకు, పదోన్నతి ప్రకారం ఇక్కడా పోస్టింగ్ ఇవ్వక, మాతృ సంస్థకు పంపించకపోవడంతో పాత ఉద్యోగమే చేస్తున్నాడు. ఆయనతో పాటు మరికొందరు ఉద్యోగులదీ అదే పరిస్థితి. ఆయా ఆలయాల్లో సీనియారిటీ ప్రకారం పదోన్నతి పొంది, పాత ఉద్యోగాన్నే కొనసాగిస్తున్నారు. తమకు పదోన్నతి లభించిందని, బదిలీ అయిన చోట స్థానం లేదని ఇప్పటికే రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అందుకు ఆయా దేవాలయాలు అధికారులు కూడా ధ్రువీకరిస్తూ తమ ఆలయంలో పదోన్నతి పొందిన వారిని వెనకి పంపాలని ప్రత్యుత్తరాలు జరిపారు. వాటిని మాత్రం అలానే పెండింగ్‌లో ఉంచి డిప్యూటేషన్లను ప్రోత్సహిస్తున్న తీరు ఉద్యోగ వర్గాల్లో అసహనానికి దారితీస్తున్నది.