siricilla | సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నమాజ్ చెరువు కట్టపై విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ గద్దెను శుక్రవారం ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. ఆగస్టు 6న జయశంకర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహావిష్కరణ చేయనున్న కార్యక్రమంలో భాగంగా జయశంకర్ విగ్రహ గద్దె నిర్మాణ పనులను ప్రారంభించారు.
నమాజ్ చెరువు కట్ట పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయొద్దని, అది ఎప్టీఎల్ పరిధిలో ఉంటుందని ఇరిగేషన్ డీఈ నర్సింగ్ ఆదేశాల మేరకు నిర్మాణంలో ఉన్న గద్దెను జేసీబీ సహాయంతో నేలమట్టం చేశారు. దీంతో ఒకసారి భగ్గుమన్న విశ్వబ్రాహ్మణ సభ్యులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. రాష్ట్రాన్ని సిద్ధించిన గొప్ప మహనీయుడు జాతిపిత అలాంటి వారి విగ్రహ ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం తగదన్నారు. జయశంకర్ గద్దె కూల్చిన చోటనే తిరిగి ఏర్పాటు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.