పెద్దపల్లి, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): అనేక అబద్ధాలు, మోసపూరిత మాటలతో గెలిచిన మంథని ఎమ్మెల్యే దగాకోరు, మోసగాడు అని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటుగా విమర్శించారు. ఆయన నేషనల్ హైవే నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆనాడు లేఖ రాస్తే ప్రజలు నమ్మారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిధిలో లేదు.. కేంద్రం పరిధిలో ఉందంటూ దాటవేస్తున్నాడని విమర్శించారు. ఆ ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఎకరాకు 50 లక్షలు ఇప్పించాలని, ఇండ్లకు సరైన కొలతలు తీసి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేషనల్ హైవే నిర్మాణంలో మంథని నియోజకవర్గంలో వందల ఎకరాల్లో భూములు పోతున్నాయని, పుట్టపాక ప్రధాన రహదారి పకనే ఉన్న భూములకు ప్రస్తుతం ఎకరానికి కోటి ధర పలుకుతుందన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంథని ఎమ్మెల్యే ఎకరాకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి లేఖ రాశాడని గుర్తు చేశారు. అయితే కేంద్రానికి ఎవరైనా తెలుగులో లేఖ రాస్తారా..? అని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలా చేశాడని విమర్శించారు. అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లేఖ విషయాన్నే మరిచిపోయాడని మండిపడ్డారు. ఆయన విద్యావంతుడని, మేధావి అంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోనే ఉందని, మంథని ఎమ్మెల్యే, మంత్రి హోదాలో ఉండి కూడా ఇప్పటి వరకు నేషనల్ హైవే నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదని, కనీసం కలెక్టర్‌తో సమీక్ష చేయలేదని విమర్శించారు. లగచర్ల ఘటనలో కుట్ర జరిగిందని, ఎవరినీ వదిలిపెట్టమని ప్రకటనలు చేయడం కాదని, నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయాలని హితవు పలికారు. నిర్వాసితుల్లో రైతులే కాదు, ఎంతో మంది కాంగ్రెస్ వాళ్లు ఉన్నారని వివరించారు. కేసులు పెట్టాల్సి వస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మొత్తం కేబినెట్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులపై పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసినందుకు 420 కేసు పెట్టాలన్నారు. పెద్దపల్లి కలెక్టర్ సైతం నిర్వాసితులకు న్యాయం చేసేలా చూడాలని, ఎమ్మెల్యే చెప్పినట్లు చేస్తామని ఆయన చెబుతున్న మాటలు వింటే ప్రజల తిరుగుబాటు తప్పదని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు మారెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించి ఫీల్డ్‌లోకి రావాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గుజ్జుల రాజిరెడ్డి, అత్తె చంద్రమౌళి, బెల్లంకొండ ప్రకాశ్‌రెడ్డి, నూనె కుమార్, సుదాటి రవీందర్రావు, కాపురబోయిన భాస్కర్, పెగడ శ్రీనివాస్, రొడ్డ శ్రీనివాస్, మధు పాల్గొన్నారు.