కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 30 : మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్లో చేరికల జోష్ కనిపిస్తున్నది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి వలసల పర్వం కొనసాగతున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలనలో చేసిందేమీ లేకపోగా.. ఇప్పటికీ అంతటా కేసీఆర్ చేసిన అభివృద్ధే కండ్ల ముందు కనిపిస్తున్నది. అందుకే హస్తం, కమలం పార్టీలతోపాటు ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్వైపు చూస్తున్నారు. మళ్లీ అభివృద్ధి జరగాలన్నా.. సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కేసీఆర్ రావాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తమ మద్దతు అవసరమని భావిస్తూ.. గులాబీ పార్టీలోకి వస్తున్నారు. పది రోజుల నుంచి ఏ జిల్లాలో చూసినా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల సమక్షంలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారు.
శుక్రవారం సిరిసిల్ల తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ సమక్షంలో 5వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మోసిన్తోపాటు పెద్ద సంఖ్యలో యువకులు చేరారు. 31వ వార్డుకు చెందిన పాశికంటి లవణ్ కూడా చేరారు. వీరికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి ప్రతి ఒక్కరూ ఐక్యతతో పని చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే కరీంనగర్ జిల్లాకేంద్రంలోనూ వలసల వెల్లువ కొనసాగింది. నగరంలోని 31వ డివిజన్‌కు చెందిన ఎంఐఎం మాజీ కార్పొరేటర్ భర్త ఆలీబాబా, 59వ డివిజన్ మాజీ కార్పొరేటర్ అఖిల్ ఫెరోజ్‌తో పాటు వీరి అనుచరులు వంద మందికి పైగా ఎమ్మెల్యే గంగుల నివాసం వేదికగా బీఆర్ఎస్లో చేరారు. అలాగే, 42వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఖలీద్ ఆలీ వారి అనుచరులు 20 మందితో చేరగా, వీరందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చేరిన నాయకులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలోనే నగరం ఎంతగానో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. అప్పుడు జరిగిన అభివృద్ధే తప్ప, ఈ రెండేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో జరిగిందేమీ లేదని విమర్శించారు. నగరం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావు, నాయకులు నందెల్లి మహిపాల్, నాయకులు మీర్ షౌకత్‌అలీ, కర్ర సూర్యశేఖర్, నవాజ్, సుధాకర్‌రావు, గౌసొద్దీన్ పాల్గొన్నారు.
గోదావరిఖని, జనవరి 30: సింగరేణి రిటైర్డ్ జనరల్ మేనేజర్ కల్వల నారాయణ బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం కరీంనగర్‌లోని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాసంలో ఆయనకు కొప్పుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి, కేసీఆర్ కార్మికుల గుండెల్లో నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటిచందర్, దాసరి మనోహార్‌రెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మూలవిజయరెడ్డి, పెంట రాజేశ్, పర్లపల్లిరవి, గోపు ఐలయ్యయాదవ్, తదితరులు ఉన్నారు.