సీఎంఆర్, సన్నధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన జీవో నంబర్ 27పై మిల్లర్లు ఆగ్రహిస్తున్నారు. కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన సర్కారు, చాలా అంశాలపై క్లారిటీ ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా రా రైస్ మిల్లర్లు ఒక అడుగు ముందుకేసి, ఏకంగా కలెక్టర్లకే లేఖలు రాశారు. పాత బకాయిలు, మిల్లింగ్ చార్జీలు, పాతగన్నీ సంచులు.. ఇలా చాలా విషయాలపై స్పష్టత వచ్చే వరకు తాము సన్నధాన్యం దించుకునే ప్రసక్తే లేదని ఆ లేఖలో తేల్చిచెప్పారు. ఇదే బాటలో పెద్దపల్లి, కరీంనగర్ రా రైస్ అసోసియేషన్లు ఉండగా, దీంతో సన్నరకం కొనుగోళ్లు అధికారులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగివస్తుందా..? లేక ఇంకా ఏమైనా చర్యలకు ఉపక్రమిస్తుందా..? అన్నది తేలాల్సి ఉన్నది.
కరీంనగర్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ ఎల్లారెడ్డిపేట : ఉమ్మడి జిల్లాలో వానకాలం సీజన్లో మొత్తం 9.82 లక్షల పైచిలుకు ఎకరాల్లో వరి సాగైంది. అందులో 6.06 లక్షల ఎకరాల్లో దొడ్డురకం, 3.76 లక్షల ఎకరాల్లో సన్నరకం సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ గణాంకాల ద్వారా వెల్లడైంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు, సన్నరకం ధాన్యం కొనేందుకు వేర్వేరు సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైన్ రకాలు క్వింటాల్‌కు 2,320, కామన్ రకాలు 2,300 ధర ఉండగా, సన్నరకం ధాన్యం క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామని సర్కారు ప్రకటించింది. గతంలో కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు వడ్లను కొనుగోలు చేసేవారు. అప్పుడు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ పరికరంతో దొడ్డు, సన్నరకాలు గుర్తించకుండా కేవలం తేమ, తాలు, రాళ్లు తదితర ప్రమాణాల శాతాన్ని పరిశీలించేవారు. ప్రస్తుతం సన్నరకం కొనుగోలుకు గ్రెయిన్ కాలివర్ (డయల్ మైక్రో మీటర్) పరికరాన్ని వినియోగిస్తున్నారు. దీని ద్వారా గింజ పొడువు, వెడల్పు కొలుస్తారు. నాణ్యతను కూడా గుర్తిస్తారు. ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ప్రభుత్వం ఇచ్చే బోనస్ వర్తిస్తుంది. గింజ పొడవు 6 మిల్లీమీటర్లు, వెడల్పు 2 మీటర్ల కంటే తక్కువగా ఉండి.. పొడవు వెడల్పు నిష్పత్తి, తేమ శాతం ఉన్న ధాన్యంలో కొన్ని గింజల పొట్టు తీసి గ్రెయిన్ కాలివర్ పరికరం సన్న, దొడ్డు రకాలుగా నిర్ధారిస్తుంది.
సన్నధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే మిల్లర్లు విముఖత చూపుతుండగా, ఈ నెల 30న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 27 అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. డిఫాల్టర్లకు ఈ సారి సీఎంఆర్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిన సర్కారు, ఇదే సమయంలో ధాన్యం కేటాయింపులకు సంబంధించి పలు నిబంధనలు విధించింది. ఇప్పటి వరకు బకాయిలేని వారు 10 శాతం బ్యాంకు గ్యారెంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే బకాయిలను పెనాల్టీతో తీర్చిన వారు 20 శాతం బ్యాంకు గ్యారెంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలని, బకాయిలు తీర్చినా పెనాల్టీ కట్టని వారు 25 శాతం బ్యాంకు గ్యారెంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని పేర్కొన్నది. మిల్లర్లకు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో దొడ్డురకం ధాన్యం క్వింటాల్‌కు 30, సన్నాలకు 40 మిల్లింగ్ చార్జీలు పెంచుతున్నట్టు చెప్పిన సర్కారు, అందులోనూ కొర్రీలు పెట్టింది. గడువులోగా మిల్లింగ్ చేస్తేనే ఈ రేట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. నిజానికి కొన్నిసార్లు ఎఫ్‌సీఐ గోదాముల్లో బియ్యం నిల్వచేసే సామర్థ్యం లేక కూడా సీఎంఆర్ ఆలస్యమవుతుంది. అటువంటి సందర్భాల్లోనూ మిల్లర్లకు కొత్త మిల్లింగ్ చార్జీలు వర్తించవు. మిల్లర్ తప్పులేనప్పుడు ఆ మిల్లింగ్ చార్జీలు ఎలా చెల్లిస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఇటువంటి అనేక ఆంక్షలపై మిల్లర్లు మండిపడుతున్నారు. అంతేకాదు, నిజాయితీగా నడిచిన మిల్లర్లను, అలాగే తప్పులు చేసి డిఫాల్టర్ అయిన వారిని ఒకే గాడిన కట్టడం ప్రభుత్వానికి భావ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆంక్షల నేపథ్యంలో సీఎంఆర్ ధాన్యం తీసుకునేందుకు మిల్లర్లు వి ముఖ చూపుతుండగా, రా రైస్ మిల్లర్లు మాత్రం ఒక అడుగు ముందుకేసి తెగేసి చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వం చెబుతున్నట్టు క్వింటాల్‌కు 67 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల క్వింటాల్‌కు దాదాపు 300కుపైగా నష్టం వాటిల్లుతుందని, ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తే తాము తీసుకోవడానికి సిద్ధమని, ఈ విషయంపై ముందుగానే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పాత మిల్లింగ్ చార్జీలు, ఇతర బకాయిలు ముందుగా చెల్లించాలని, వీటితో పాటు గన్నీ బ్యాగుల విషయంలో స్పష్టత ఇవ్వాలని, ముఖ్యంగా రైస్‌మిల్లులకు కొత్త గన్నీ బ్యాగులు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ప్రస్తుతం పెంచిన మిల్లింగ్ చార్జీలు సరిపోవని, పక్క రాష్ర్టాల్లో పరిశీలించి ఆ మేరకు ఇవ్వాలంటున్నారు. తమ డిమాండ్లపై స్పష్టత వచ్చిన తర్వాతే సన్నధాన్యం లోడ్లు దించుకుంటామని, అప్పటివరకు తమకు ధా న్యం కేటాయింపులు చేయవద్దని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల రా రైస్‌మిల్లర్లు తెగేసి చెప్పారు. అవసరమైతే తమను మిల్లింగ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా తమపై ఒత్తిళ్లు తెచ్చినా ప్రయోజనం ఉండదని కుండబద్ధలు కొట్టి ఉన్నతాధికారులకు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో సన్నధాన్యం కొనుగోళ్లు అనేది అధికారులకు సవాల్‌గా మారింది. ఇప్పటికే మార్కెట్‌కు సన్నధాన్యం వస్తున్నది. అది కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు అలాట్మెంట్ చేయాలి. కానీ, మిల్లర్లు దించుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తన విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందా..? లేక మొండిగా ముందుకెళ్లి మిల్లర్లను తన దారిలోకి తెచ్చుకుంటుందా..? అన్న ఉ త్కంఠ నెలకొన్నది. కాగా, సన్నధాన్యం గుర్తింపు బాధ్యతను వ్యవసాయ విస్తరణాధికారులకు అప్పగించారు. ఇప్పటికే సవాలక్ష విధులతో సతమతమవుతున్న ఏఈవోలు.. కొత్త బాధ్యతను తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.